DC vs MI: డగౌట్‌లో కెప్టెన్సీతో అదరగొట్టిన హిట్ మ్యాన్.. రోహిత్‌కు హార్దిక్ ఫ్లయింగ్ కిస్

DC vs MI: డగౌట్‌లో కెప్టెన్సీతో అదరగొట్టిన హిట్ మ్యాన్.. రోహిత్‌కు హార్దిక్ ఫ్లయింగ్ కిస్

ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ ఆదివారం (ఏప్రిల్ 13) అద్భుత విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కీలకంగా మారిన మ్యాచ్ ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగుల తేడాతో గెలిచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఒకదశలో ముంబై ఓటమి ఖాయమనుకున్నారు. ఢిల్లీ ముందు 206 పరుగుల లక్ష్యాన్ని ఉంచినా.. కరుణ్ నాయర్ ధనాధన్ ఇన్నింగ్స్ కు మ్యాచ్ ఢిల్లీ వైపుకు మొగ్గింది. తొలి 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి విజయం దిశగా వెళ్తుంది. 

ఈ దశలో రోహిత్ శర్మ డగౌట్ నుంచి ఇచ్చిన ఒక సలహా అద్భుతంగా పని చేసింది. 13 ఓవర్లో అక్షర్ పటేల్ ను బుమ్రా ఔట్ చేసిన తర్వాత ముంబై మ్యాచ్ లోకి వచ్చింది. ఈ సమయంలో స్టబ్స్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత స్పిన్నర్ కరణ్ శర్మను బౌలింగ్ కు తీసుకురావాలని హార్దిక్ పాండ్య సూచించాడు. రోహిత్ చెప్పినట్టు పాండ్య 14 ఓవర్ లో కరణ్ శర్మను తీసుకొచ్చాడు. ఈ ఓవర్ లో తొలి రెండు బంతులకు పరుగులు రాకపోగా.. ఒత్తిడిలో పడిన స్టబ్స్ మూడో బంతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

స్టబ్స్ ఔట్ కావడంతో ఢిల్లీ ఐదో వికెట్ ను కోల్పోయింది. దీంతో ముంబై జట్టు సంబరాల్లో మునిగి తేలిపోయింది. హిట్ మ్యాన్ చెప్పిన ఐడియా పని చేసినందుకు హార్దిక్ గ్రౌండ్ లో నుంచి డగౌట్ లో ఉన్న రోహిత్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రోహిత్ శర్మ డగౌట్ లో ఉండి కూడా తన కెప్టెన్సీతో అదరగొట్టాడని ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. ఆ తర్వాత ముంబై బౌలర్లు పట్టు బిగించడంతో ఒత్తిడిలో ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో వరుసగా మూడు రనౌట్స్ కావడం ఢిల్లీ ఓటమిపై తీవ్ర ప్రభావం చూపించింది. 

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది.