![Hardik Pandya: నా కోసం కాదు, దేశం కోసం ఆడుతున్నా.. దేశం తరుపున ఆడుతున్నా: పాండ్య](https://static.v6velugu.com/uploads/2025/02/hardik-pandya-is-all-set-for-the-highly-anticipated-icc-champions-trophy_zIVbdGtRZE.jpg)
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా ఈ సిరీస్ భారత్ కు ఉపయోగపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీకి టీమిండియా ఆల్ రౌండర్ పాండ్య కీలకం కానున్నాడు. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత్ తమ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఫిబ్రవరి 23 న మ్యాచ్ జరగనుంది.
కీలక టోర్నీకి ముందు పాండ్య ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు తెలిపాడు. బుధవారం(ఫిబ్రవరి 5) ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. " ఒత్తిడిని ఎవరు బాగా ఎదుర్కొంటారనేది ముఖ్యం. నేను హార్దిక్ పాండ్యా తరఫున ఆడను. నా జట్టు తరఫున ఆడుతాను. నా దేశం ఇండియా తరఫున ఆడడమే నా లక్ష్యం. చివర్లో రెండు బంతులు ఆడినా.. 60 బంతులు బ్యాటింగ్ చేసినా టీమిండియాను గెలిపించడం పైనే నా దృష్టి ఉంటుంది. ఒత్తిడి సమయంలో బాగా ఆడిన వారికే విజయం దక్కుతుంది". అని హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా 2022 టీ20 ప్రపంచ కప్‌లో మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్ పై జరిగిన ఉత్కంఠ మ్యాచ్ గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అభిమానులు ఇచ్చిన సపోర్ట్ మరవలేనని.. ఎంతో భావోద్వేగంతో కూడుకుందని పాండ్య అన్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆల్ రౌండర్ గా ఈ మ్యాచ్ లో పాండ్య అద్భుతంగా రాణించాడు. బౌలింగ్ లో మూడు వికెట్లు తీయడంతో పాటు.. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీతో రాణించాడు.