
నవీ ముంబై: ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌కు రెడీ అవుతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని కాంపిటీటివ్ క్రికెట్‌లోకి తిరిగొచ్చాడు. డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్‌లో సోమవారం రిలయన్స్ వన్ టీమ్ తరఫున బరిలోకి దిగిన పాండ్యా (2/22) మూడు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. గత అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా మోకాలి గాయానికి గురైన పాండ్యా అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. నాలుగు నెలల గ్యాప్ తర్వాత తిరిగి గ్రౌండ్‌లోకి వచ్చిన అతను వచ్చే నెలలో జరిగే ఐపీఎల్‌లో బరిలోకి దిగనున్నాడు. రోహిత్ శర్మ ప్లేస్‌లో కెప్టెన్‌గా ఎంపికైన పాండ్యా ముంబై ఇండియన్స్‌ను నడిపించనున్నాడు.