శ్రీలంక వేదికగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 26 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్ మొదలవ్వనుంది. వన్డే సిరీస్ కు భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే సిరీస్ కు దూరం కానున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వ్యక్తిగత కారణాల వలన పాండ్య వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఈ ఆల్ రౌండర్ బీసీసీఐకు తెలియజేశాడట. దీంతో వన్డే సిరీస్‌కు పాండ్య దూరమవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 లో గాయపడిన పాండ్య ఇప్పటివరకు వన్డే మ్యాచ్ ఆడలేదు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు దూరమయ్యాడు. టీ20 సిరీస్ కు మాత్రం పాండ్య అందుబాటులో ఉండనున్నాడు. రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో పాండ్య భారత క్రికెట్ టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ రేస్ లో పాండ్యకు గట్టి పోటీదారుడిగా ఉన్నాడు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ లక్ష్యంగా భారత్ ఈ సిరీస్ లో బరిలోకి దిగుతుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపడతారు. వస్తున్న నివేదికల ప్రకారం గంభీర్ లంక సిరీస్ కు కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేయాల్సిందిగా బీసీసీఐని కోరాడట. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ ల కోసం బీసీసీఐ, సెలెక్టర్లు జూలై 16న జట్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.