T20 World Cup 2024: విమర్శల నుంచి ప్రశంసల వరకు.. వరల్డ్ కప్‌లో కీలకంగా మారిన పాండ్య

T20 World Cup 2024: విమర్శల నుంచి ప్రశంసల వరకు.. వరల్డ్ కప్‌లో కీలకంగా మారిన పాండ్య

టీమిండియా స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్య 2024 ఐపీఎల్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన హార్దిక్ తొలి మ్యాచ్ నుంచే ట్రోలింగ్ కు గురయ్యాడు. ఓ వైపు కెప్టెన్ గా.. మరోవైపు బ్యాటర్ గా దారుణంగా విఫలమవుతున్నాడని దారుణంగా ట్రోల్ చేశారు. దీనికి తోడు వ్యక్తిగతంగానూ హార్దిక్ జీవితం అంత సాఫీగా లేదు. భార్య నటాషాతో విడాకులు అంటూ గట్టిగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ కు ముందు పాండ్య తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. 

ఐపీఎల్ లో విఫలం కావడంతో ఒకదశలో పాండ్యకు వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కడం అనుమానంగా మారింది. అయితే జట్టు యాజమాన్యం అతని మీద నమ్మకం ఉంచడమే కాదు ఏకంగా వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. దీంతో మరోసారి నెటిజన్స్ పాండ్యపై నెగెటివ్ కామెంట్స్ చేశారు. వైస్ కెప్టెన్సీ ఇచ్చి తప్పు చేశారనే కామెంట్స్ వినిపించాయి. అయితే వీటన్నిటికీ పాండ్య చెక్ పెట్టేశాడు. టీ20 వరల్డ్ కప్ లో అదరగొడుతూ భారత జట్టుకు కీలకంగా మారుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటుతూ ఆల్ రౌండర్ పదానికి న్యాయం చేస్తున్నాడు. 

బౌలింగ్ లో 4 ఓవర్ల కోటా పూర్తి చేస్తున్న పాండ్య.. బ్యాటింగ్ లోనూ రాణిస్తున్నాడు. ముఖ్యంగా సూపర్ 8 లో హార్దిక్ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన తొలి మ్యాచ్ లో 24 బంతుల్లో 32 పరుగులు చేసి విలువైన పరుగులు చేశాడు. ఇక శనివారం (జూన్ 22) బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో 27 బంతుల్లో 50 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. బౌలింగ్ లోనూ రాణిస్తూ 8 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జట్టులో అత్యంత కీలక ప్లేయర్ గా మారాడు. పాండ్య ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరి ఇదే జోరును పాండ్య కొనసాగిస్తాడో లేదో చూడాలి.