IND vs BAN 2024: అప్పర్ కట్‌లో ఇదో కొత్త రకం.. హార్దిక్ పాండ్య స్టైలిష్ షాట్

IND vs BAN 2024: అప్పర్ కట్‌లో ఇదో కొత్త రకం.. హార్దిక్ పాండ్య స్టైలిష్ షాట్

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య క్రికెట్ లో కొత్త షాట్ ను పరిచయం చేశాడు. ఆదివారం (అక్టోబర్ 6) గ్వాలియర్‌ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20లో హార్దిక్ పాండ్య బ్యాటింగ్ లో మెరుపు షాట్లతో అలరించాడు. ముఖ్యంగా అతను కొట్టిన అప్పర్ కట్ ఆశ్చర్యం కలిగించక మానదు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ వేసిన షార్ట్ డెలివరీని పాండ్యా వికెట్ కీపర్ తలపై నుంచి స్కూప్ షాట్ ఆడాడు. క్యాచ్ కు అవకాశం లేని ఈ షాట్ బౌండరీ వెళ్ళింది.

బ్యాట్ పూర్తిగా స్వింగ్ చేయకుండా చిన్న కట్ తో పాండ్య ఆడిన అప్పర్ కట్ కు అందరూ ఫిదా అయ్యారు. వికెట్ కీపర్ లిటన్ దాస్ ఈ షాట్ చూసి షాకయ్యాడు. షాట్ ఆడిన తర్వాత హార్దిక్ వెనక్కి తిరిగి చూడకపోవడం విశేషం. క్రికెట్ లో ఇదొక కొత్త రకం షాట్ అని నెటిజన్స్ ఈ ఆల్ రౌండర్ ని కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య చెలరేగి ఆడి 16 బంతుల్లోనే 2 ఫోర్లు,5 సిక్సర్లతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్ లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. 

Also Read :- కొరియో గ్రాఫర్ జానీకి దెబ్బ మీద దెబ్బ.. మళ్లీ రిమాండ్ కేనా.?

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. 35 పరుగులు చేసిన మెహదీ హసన్ మిరాజ్ టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 11.5  ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులుచేసి గెలిచింది. హార్దిక్ పాండ్య (39: 16 బంతుల్లో 2 ఫోర్లు,5 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఢిల్లీ వేదికగా బుధవారం (అక్టోబర్ 9) జరుగుతుంది.