T20 World Cup 2024: అందుకు చాలా సమయం ఉంది.. కెప్టెన్సీపై స్పందించిన హార్దిక్ పాండ్య

T20 World Cup 2024: అందుకు చాలా సమయం ఉంది.. కెప్టెన్సీపై స్పందించిన హార్దిక్ పాండ్య

వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది. బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇప్పుడు తదుపరి టీమిండియా కెప్టెన్ ఎవరనే చర్చ మొదలయింది. ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 లో రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. దీంతో రోహిత్ తర్వాత పాండ్యకు కెప్టెన్సీ అప్పగించడం దాదాపు ఖాయమైంది.

టీ20 వరల్డ్ కప్ భారత్ గెలిచిన తర్వాత పాండ్యకు రోహిత్ తర్వాత కెప్టెన్సీ మీదేనా అనే ప్రశ్నకు పాండ్య తనదైన శైలిలో స్పందించాడు. "2026 వరల్డ్ కప్ కు చాలా సమయం ఉంది. ప్రస్తుతం రోహిత్, విరాట్ పట్ల నేను చాల సంతోషంగా ఉన్నాను. ఈ ఇద్దరు దిగ్గజాలు టైటిల్ గెలవడానికి పూర్తిగా అర్హులు. చాలా సంవత్సరాలుగా వారితో ప్రయాణం అద్భుతంగా అనిపించింది. ఈ ఇద్దరిని మిస్ అవుతున్నా". అని పాండ్య కెప్టెన్సీ గురించి దాటేసి కోహ్లీ, రోహిత్ లను ప్రశంసలతో ముంచెత్తాడు. 

రోహిత్ డిప్యూటీగా కొనసాగినా పాండ్య టీమిండియాకు పరిమిత ఓవర్ల కెప్టెన్ అన్నట్టు అధికారికంగా ప్రకటించలేదు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా , సూర్యకుమార్ యాదవ్,శుభమాన్ గిల్, రిషబ్ పంత్ ఇలా చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. వీరందరికీ కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అయితే రోహిత్ గైర్హాజరీలో టీ20ల్లో భారత జట్టును నడిపిన పాండ్యకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లో గుజరాత్ జట్టును రెండుసార్లు ఫైనల్ కు తీసుకొచ్చిన పాండ్య ఒకసారి విజేతగా నిలిపాడు.