- యాదాద్రి ఘాట్ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్
యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కొండ కింద నుంచి కొండపై వరకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్ లో ఎదురుచూడాల్సి వచ్చింది. కార్తీక మాసంతో పాటు ఇవాళ ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. సాధారణ సెలవు రోజుల్లోనే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటారు.
క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి ఉన్నా.. ఆలయ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ కింద నుండి ఆర్టీసీ బస్సులు లేక కొందరు భక్తులు కాలినడకన కొండపైకి వెళ్లి.. స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు 500 రూపాయలు టికెట్ తీసుకుని కారులో కొండపైకి వెళ్లిన భక్తులు కూడా ఇబ్బందులు పడ్డారు. తమ కార్లను పార్కింగ్ చేసేందుకు తగినంత స్థలం లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కొండ కింది నుండే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడంతో ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది.