ప్రధాని హామీ ఇచ్చినా.. మారని తలరాతలు

ప్రధాని హామీ ఇచ్చినా.. మారని తలరాతలు
  • ప్రత్యేక పాలసీ కోసం ఎదురుచూపులు
  • ఉపాధికి దూరమవుతున్న కొయ్య బొమ్మల కళాకారులు 
  • కష్టకాలంలో  కొయ్య బొమ్మల పరిశ్రమ
  • పొనికి కర్రకు తీవ్ర కొరత

నిర్మల్, వెలుగు: నిర్మల్ కొయ్య బొమ్మల కళాకారుల కష్టాలు తీరడంలేదు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చినా ఇక్కడి కళాకారుల తలరాతలు మారడం లేదు. ఎంపీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొయ్య బొమ్మల పరిశ్రమను అణగదొక్కిందని, ఈ పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొయ్య బొమ్మల కళాకారులకు ఉపాధి కల్పించేందుకు కొత్త పాలసీని అమలు చేస్తామని స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. 

డిమాండ్ ఉన్నా.. మద్దతు కరువు

నిర్మల్ కొయ్య బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ తయారయ్యే కొయ్య బొమ్మలను దేశ, విదేశాల్లో విక్రయిస్తుంటారు. కానీ ముడి సరుకు కొరత, ధరల పెరు గుదలతో బొమ్మల కు గిరాకీ  క్రమంగా తగ్గుతుంది. సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్న కొయ్య బొమ్మలకు బహిరంగ మార్కెట్​లో డిమాండ్ ఉన్నప్ప టికీ ముడి సరుకుల ధరలు పెరిగిపోవడంతో బొమ్మల తయారీపై ప్రభావం చూపుతోంది. 

బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి కర్రకు కొరత ఏర్పడుతుండడం, ఎగుమతుల విధానం సక్రమంగా లేకపోవడం, ప్రభుత్వాలు ఈ పరిశ్రమను ప్రోత్సహించకపోతుండడంతో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిశ్రమను బలోపేతం చేసేందుకు గాను  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కళాకారులకు శాపంగా మారుతోంది.

ప్రధాని హామీతో కళాకారుల్లో ఆశలు

ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్ర ధానమంత్రి నరేంద్ర మోదీ.. బీజేపీ ప్రభుత్వం కొయ్య బొమ్మల పరిశ్రమను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఈ పరిశ్రమను ప్రోత్సహించేం దుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రధాని హామీతో నిర్మల్ కొయ్య బొమ్మల కళాకారుల కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. 

Also Read :- సర్కారు భూములకు పట్టాలు..కబ్జాలో గైరాన్​, భూదాన్​ భూములు

అయితే ఎన్నికలు ముగిసి కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటివరకు కొయ్య బొమ్మల పరిశ్రమకు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆందోళన చెందుతున్న కళాకారులు.. ప్రధాని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నా రు. 

ట్రైనింగ్​ఇచ్చి వదిలేశారు

నిర్మల్ కొయ్య బొమ్మలకు కొత్త అందాలు తెచ్చేందుకు కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్ సంస్థ ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ ఆధ్వర్యంలో కొన్ని నెలల క్రితం గురు శిష్య హస్త శిల్ప ప్రశిక్షణ కార్యక్రమం చేపట్టింది. ఇందుకు రాష్ట్రం నుంచి కేవలం నిర్మల్ కొయ్య బొమ్మల కేంద్రాన్ని మాత్రమే ఎంపిక చేశారు. 

కేవలం 25 నుంచి 30 సంవత్సరాల లోపు వయసున్న కళాకారులకు ప్రాధాన్యత నిచ్చి వీరందరికీ మూడు నెలల పాటు నిర్మల్ కొయ్య బొమ్మల కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. వీరందరికీ ఆర్టిజన్ ఐడీ కార్డులు అందించింది. దేశ, విదేశాలలో నిర్వహించే ట్రేడ్ ఫేర్​లలో కొయ్య బొమ్మల ప్రదర్శనకు అవకాశాలు ఏర్పడతాయని అధికారులు వెల్లడించారు. కానీ ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రధాని హామీని అమలు చేయాలి

ఉపాధి లేక, బొమ్మలకు సరైన మార్కెట్ లేక తాము నష్టాల పాలవుతున్నాం. కొయ్య బొమ్మల పరిశ్రమను ఆదుకుంటామని, ప్రోత్సహించేందుకు కొత్త పాలసీ రూపొందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీపై ఆశలు పెట్టుకున్నాం. వెంటనే ఆ పాలసీని రూపొందించి ప్రధాని హామీ అమలు చేయాలి. -  పెంటయ్య, కొయ్య బొమ్మల కళాకారుడు