- కాంగ్రెస్, బీజేపీ దిమ్మతిరిగేలా మేనిఫెస్టో
నల్గొండ/సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్, బీజేపీ దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని, రాష్ట్ర ప్రజలు అబ్బురపడే శుభవార్త చెబుతారని చెప్పారు. శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో హరీశ్ రావు పర్యటించారు.
జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని విమర్శించారు. బీఆర్ఎస్ పక్కకు పెట్టినోళ్లను పిలిచి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.10 కోట్లకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్.. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తుందని కామెంట్ చేశారు. ‘‘కరెంట్ సప్లై గురించి మాట్లాడే హక్కు కాంగ్రెసోళ్లకు లేదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 3గంటల కరెంట్‌చాలు అన్నారు.
మూడు గంటలే కావాలంటే కాంగ్రెస్ కు, 24 గంటల ఉచిత విద్యుత్ కావాలంటే బీఆర్ఎస్కు ఓటెయ్యండి” అని ప్రజలకు సూచించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ్రీ కరెంట్ ఎక్కడ వస్తుందో చూపెట్టుమంటున్నాడని, ఒకసారి వేలు పెట్టి చూస్తే కరెంట్ వస్తుందో లేదో తెలుస్తదని సెటైర్ వేశారు. ‘‘కాంగ్రెస్‌లో వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి .. ఇలా పేరుకే పెద్ద లీడర్లు ఉన్నారు. వాళ్లు పదవుల మీద, పైరవీల మీద బతికారే తప్పా ప్రజల కడుపు నింపేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు” అని అన్నారు.