ప్రత్యర్థులు కూడా సంతోషించారు: ద్రోణవల్లి హారిక

ప్రత్యర్థులు కూడా సంతోషించారు: ద్రోణవల్లి హారిక

న్యూఢిల్లీ: చెస్‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌లో తమ పెర్ఫామెన్స్‌‌‌‌ చూసి ప్రత్యర్థులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలుగు గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ద్రోణవల్లి హారిక తెలిపింది. టోర్నీలో ఇండియన్‌‌‌‌ ప్లేయర్ల ఆటను చూసిన తర్వాత ప్రత్యర్థులు ఎలా స్పందించారని ప్రధాని నరేంద్ర మోదీ అడిగిన ప్రశ్నకు హారిక పై విధంగా స్పందించింది. బుధవారం జరిగిన సమావేశంలో ఒత్తిడి, ఆర్టిఫిషియల్‌‌‌‌ ఇంటలిజెన్స్‌‌‌‌ (ఏఐ), బర్త్‌‌‌‌ డే  గురించి మోదీ.. ప్లేయర్లతో ముచ్చటించారు. ఒలింపియాడ్‌‌‌‌ ట్రోఫీని కచ్చితంగా గెలవాలనే తాము బరిలోకి దిగామని తానియా సచ్‌‌‌‌దేవ్‌‌‌‌ వెల్లడించింది. అమెరికాను ఓడించడం ద్వారా తమను ఎవరూ టచ్‌‌‌‌ చేయలేరని నిరూపించామని చెప్పింది. టీమ్‌‌‌‌ వర్క్‌‌‌‌ ద్వారానే ఇదంతా సాధ్యమైందని గుకేశ్‌‌‌‌ అన్నాడు.

 లాస్ట్‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌లో ఒక్క మ్యాచ్‌‌‌‌ ఓడటంతో గోల్డ్‌‌‌‌ దూరమైందని, ఈసారి అది జరగొద్దని ముందు నుంచే పక్కా ప్లాన్‌‌‌‌తో ఆడామన్నాడు. ఏఐతో చెస్‌‌‌‌ మరింత అభివృద్ధి చెందిందని, కంప్యూటర్లు కూడా చాలా బలంగా మారాయని, అవే తమకు కొత్త ఆలోచనలు చూపుతున్నాయని మోదీ ఏఐపై అడిగిన ప్రశ్నకు ప్రజ్ఞానంద జవాబిచ్చాడు. ఇక క్రీడలపై తనకున్న ఆసక్తి గురించి అడిగినప్పుడు.. దేశాభివృద్ధికి ఇది కూడా ఓ సూచిక అని మోదీ అన్నారు. వంతిక అగర్వాల్‌‌‌‌ బర్త్‌‌‌‌ డే (సెప్టెంబర్‌‌‌‌ 28)ను మోదీ గుర్తు చేయడంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది. 9 ఏళ్ల వయసులో జూనియర్ టోర్నీలో మోదీ సత్కరించడాన్ని గుర్తు చేసుకుంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను ప్రధానికి బహూకరించింది. యోగా, ధ్యానం చేయాలని ఈ సందర్భంగా మోదీ.. ప్లేయర్లకు సూచించారు.