డిసెంబర్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘హరికథ’.. ట్రైలర్ చూశారా..?

రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, దివి, పూజిత పొన్నాడ,  మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘హరికథ’. మ్యాగీ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈనెల 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా  రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీలో నాది 48 ఏళ్ల నట జీవితం. నటుడిగా నాకు ఇప్పటికీ  ‘హరికథ’ లాంటి గొప్ప స్క్రిప్ట్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నా.  ఏఎన్నార్, ఎన్టీఆర్ చేయాల్సిన రోల్ నాకు దక్కడం సంతోషంగా ఉంది.

హరికథలు చెబుతూ జీవితాంతం హరి నామస్మరణ చేసే రంగాచారి పాత్రలో  కనిపిస్తాను’ అని చెప్పారు.  ఈ సిరీస్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని, తమ పాత్రలు గుర్తుండిపోతాయని శ్రీరామ్ చెప్పాడు. చామంతి పాత్రలో ఆకట్టుకుంటానంది దివి.  ఇది చాలా పెద్ద స్క్రిప్ట్ అని, వైవిధ్యంగా ఉంటుందని డైరెక్టర్ మ్యాగీ అన్నాడు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ‘మా సంస్థలో వస్తున్న రెండో వెబ్ సిరీస్ ఇది. తెలుగు సిరీస్‌‌లలో ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసేలా ఉంటుంది’ అని చెప్పారు.  నటులు గగన్ విహారి, ఎంఎస్ విక్రమ్, ఉషా శ్రీ,  మ్యూజిక్ డైరెక్టర్  సురేష్ బొబ్బిలి,  డీవోపీ విజయ్ ఉలగనాథ్,  ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు.