ప్రజావైద్యుడు బ‌‌త్తిని హ‌‌రినాథ్ గౌడ్ కు దక్కని గౌరవం

ప్రజావైద్యుడు బ‌‌త్తిని హ‌‌రినాథ్ గౌడ్ కు దక్కని గౌరవం

మృగ‌‌శిర కార్తె మొదటి రోజున చేప మందు ప్రసాదం ఇచ్చే బ‌‌త్తిని హ‌‌రినాథ్ గౌడ్ ఊపిరి ఆగిపోయింది. ఎన్నో దశాబ్దాలుగా  ఉచితంగా తన చేప మందుతో ఊపిరి నిలిపిన మహానుభావుని శ్వాస ఆగిపోయింది. కానీ కోట్లాది మందికి పైసా తీసుకోకుండా చేపమందు చికిత్స చేసిన నిస్వార్థ జీవి బత్తిని హరినాథ్ గౌడ్ కు తుది వీడ్కోలు పలికిన తీరును చూస్తే గుండె తరుక్కుపోయింది. నిస్వార్థ సేవకు  ప్రజల్లో, ప్రభుత్వాల్లో రాజకీయ నాయకుల్లో అంతంతమాత్రంగా వచ్చిన స్పందన చూస్తే మనిషిలో మానవత్వం చచ్చిపోయింది అనిపిస్తోంది.   గతంలో ఆయన ఇంటి ముందు క్యూలు కట్టిన వీఐపీలు, అధికారులు, రాజకీయ నాయకులు హరినాథ్ గౌడ్ మరణించినప్పుడు కనిపించకపోవడం బాధ కలిగించింది. 

బత్తిని అసాధారణ 

సేవహైదరాబాద్ పాతబస్తీలోని దూద్​బౌలికి చెందిన బత్తిని కుటుంబం తరతరాలుగా మృగశిర మొదటి రోజు ఆస్తమా బాధితులకు చేప మందు ఇచ్చి నయం చేస్తుండేవారు.  మందు ప్రభావం, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. దీంతో మృగశిర కార్తెకు వారం ముందే బత్తిని హరినాథ్ గౌడ్ ఇంటికి నలుమూలల నుంచి చేప మందు కోసం నిరీక్షించే వారి సంఖ్య మొదట వేలల్లో, తర్వాత లక్షల్లో పెరిగిపోయింది. జనసందోహాన్ని నియంత్రించలేక ప్రభుత్వమే చేప ప్రసాదం ఇచ్చే వేడుకను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు మార్చింది. ఈ మందును తమ సొంత ఖర్చుతో తయారుచేసే బత్తిని కుటుంబం దానిని లక్షల మందికి ఉచితంగానే అందించడం విశేషం. ఈ మందు ఇచ్చేందుకు అవసరమయ్యే చేప పిల్లలను నమ్ముకున్న వాళ్లే పెద్ద ఎత్తున సంపాదించేవారు. అలాంటిది బత్తిని కుటుంబం  పైసా లేకుండానే ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

నిస్వార్థ భూమి పుత్రుడికి గౌరవమేది?

ఆయ‌‌నను వేనోళ్ల కీర్తించిన వాళ్లు  హ‌‌రినాథ్ గౌడ్ మ‌‌ర‌‌ణంపై క‌‌నీసం స్పందించ‌‌కపోవ‌‌డం ఆశ్చర్యం కలిగించింది. బత్తిని మావాడ‌‌ని భుజానికెత్తుకున్న నేత‌‌లు ఏమ‌‌య్యారు?  మృగ‌‌శిర కార్తె వ‌‌చ్చిందంటే ..బ‌‌త్తిని సోద‌‌రుల ఇంటి ముందు..నాంప‌‌ల్లి గ్రౌండ్స్‌‌లో లైవ్‌‌లు పెట్టే చానెళ్లు ఏమ‌‌య్యాయి? బ‌‌త్తినిపై  పుంఖాను పుంఖాలుగా వార్తలు ప్రచురించిన ప‌‌త్రిక‌‌లేమ‌‌య్యాయి? ఎలాంటి లాభాపేక్ష లేకుండా  ఎన్నో వ్యయ‌‌ ప్రయాసల‌‌కోర్చి ప్రజారోగ్యం బాగు చేసిన బత్తిని హ‌‌రినాథ్ గౌడ్‌‌కు స‌‌రైన నివాళి లేక‌‌పోవ‌‌డం శోచ‌‌నీయం. సామాన్యుల నుంచి లక్షలు దండుకొని వందల కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ కాలేజీల యజమానుల కుటుంబ సభ్యులు మరణిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివెళ్లి మేమున్నామంటూ ఓదార్చారు. కానీ నయా పైసా ఆశించకుండా నిస్వార్థ సేవ చేసిన భూమి పుత్రుడు  బత్తిని మరణిస్తే నామమాత్రంగానే వచ్చి పోయారు.  బ‌‌తికున్నంత కాలం ప్రజారోగ్యం శ్వాసించిన బ‌‌త్తిని  హ‌‌రినాథ్ గౌడ్ నిరుపేద‌‌ల పాలిట అస‌‌లు సిస‌‌లైన మ‌‌హాత్ముడు.  ఇప్పటికైనా అధికారులు, పెద్దలు స్పందించాలి.  బ‌‌త్తిని హ‌‌రినాథ్ సేవ‌‌ల‌‌కు  స్మృతి చిహ్నంగా ఆయన  విగ్రహం ప్రతిష్టించాలి. ఇప్పటికీ సామాన్య జీవితాన్ని గడుపుతున్న బత్తిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడాలి.

విమర్శకులకు జనమే జవాబిచ్చారు

బత్తిని కుటుంబం అందించే చేప ప్రసాదానికి పేరు ప్రతిష్టలు రావడంతో జీర్ణించుకోలేని కొందరు దాని శాస్త్రీయతపై గగ్గోలు పెట్టారు. అవన్నీ కూడా  లక్షలాది జనం విశ్వాసం ముందు నిలబడలేకపోయాయి.  బత్తిని చేపమందు నిరుపేద‌‌ల పాలిట సంజీవిని. ఎవ‌‌రేమ‌‌న్నా..నింద‌‌లేసినా.. చ‌‌ట్టం త‌‌న‌‌ప‌‌ని తాను చేసుకెళ్లిన‌‌ట్టు బ‌‌త్తిన కుటుంబం త‌‌మ సేవ‌‌ను తాము కొన‌‌సాగించారు. 80 ఏళ్ల వ‌‌య‌‌సులోనూ బ‌‌త్తిన హ‌‌రినాథ్ గౌడ్ ప్రజారోగ్యం కోసం ప‌‌రిశ్రమించారు. వార‌‌సత్వంగా వ‌‌చ్చిన సంప్రదాయ వైద్యాన్ని ప్రజ‌‌ల‌‌కు అందించ‌‌డ‌‌మే  ల‌‌క్ష్యంగా జీవించారాయ‌‌న‌‌.  సామాన్యులు మాత్రమే కాదు మ‌‌హా మ‌‌హా నేత‌‌లు  బ‌‌త్తిని హ‌‌రినాథ్ సేవ‌‌ల‌‌ను కొనియాడారు. తెలుగు బిడ్డంటూ భుజం భుజం క‌‌లిపి ఫోటోలు దిగారు వ‌‌ల‌‌స పాల‌‌న‌‌లో ఎన్నో  స‌‌మ‌‌స్యలు ఎదురైనా  బ‌‌త్తిన హ‌‌రినాథ్ గౌడ్ తొణ‌‌కలేదు బెణ‌‌క‌‌లేదు. 

- శంకర్ శిగ, ఇండిపెండెంట్ జర్నలిస్ట్