2023 వన్డే వరల్డ్ కప్ పాక్ పేసర్లకు పీడకలగా మారింది. పాక్ సెమీస్ కు చేరకపోవడానికి ప్రధాన కారణం ఆ జట్టు పేసర్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. షహీన్ అఫ్రిదీ, హారిస్ రౌఫ్, హసన్ అలీతో ఎంతో బలంగా కనిపించిన బాబర్ సేన.. వీరి పేలవ ప్రదర్శన ఆ జట్టును లీగ్ దశకే పరిమితం చేసింది. ముఖ్యంగా పాక్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ అత్యధిక పరుగులు సమర్పించుకొని 48 ఏళ్ళ వరల్డ్ కప్ చరిత్రలోనే తన పేరిట చెత్త రికార్డ్ నమోదు చేసుకున్నాడు.
ఈ మెగా టోర్నీలో మొత్తం 9 మ్యాచ్ లాడిన రౌఫ్ మొత్తం 533 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల చెత్త రికార్డ్ ను రౌఫ్ దాటేశాడు. రషీద్ 2019 వరల్డ్ కప్ లో 526 పరుగులు సమర్పించుకుంటే ఆ తర్వాత స్థానంలో శ్రీలంక పేసర్ దిల్షాన్ మదుష్కా ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో 525 రన్స్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో రౌఫ్ 10 ఓవర్లలో 64 పరుగులివ్వడంతో రషీద్ రికార్డ్ బ్రేక్ అయింది. ఈ 30 ఏళ్ళ పేసర్ బౌలింగ్ కి వస్తే చాలు బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు.
తొమ్మిది మ్యాచ్‌లలోఈ రైట్ ఆర్మ్ పేసర్ 79 ఓవర్లు బౌలింగ్ చేసి 533 పరుగులు ఇచ్చాడు. 33.31 సగటుతో 16 వికెట్లు తీసిన హారిస్ రౌఫ్ ఎకానమీ 6.74 గా, స్ట్రైక్ రేట్ 29.64 గా ఉంది. న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 10 ఓవర్లలో 85 పరుగులు, ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో 8 ఓవర్లకే 83 పరుగులు ఇచ్చాడు. ఈ టోర్నీకి ముందు ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగితే చివరికి చెత్త గణాంకాలే అతనికి మిగిలాయి.