T20 World Cup 2024: అభిమానిని కొట్టబోయిన పాక్ క్రికెటర్.. ఏం జరిగిందంటే..?

T20 World Cup 2024: అభిమానిని కొట్టబోయిన పాక్ క్రికెటర్.. ఏం జరిగిందంటే..?

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. నాలుగు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో గెలిచి మరో రెండో మ్యాచ్ ల్లో ఓడిపోయి గ్రూప్ ఏ లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. భారత్, అమెరికా జట్లు ఈ గ్రూప్ లో సూపర్ 8 కు చేరుకున్నాయి. దీంతో బాబర్ సేనపై ఫ్యాన్స్ నుంచి మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుధవారం (జూన్ 19) న పాకిస్థాన్ స్వదేశానికి చేరుకోనుంది. దీంతో రెండు రోజుల నుంచి పాక్ ఆటగాళ్లు అమెరికాలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్ కు ఒక చేదు జ్ఞాపకం ఎదురైంది. 

రౌఫ్ తన భార్యతో కలిసి యూఎస్ఏలోని ఫ్లోరిడాలో వీధుల్లో నడుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఒక అభిమాని అతనిని ఏదో అన్నాడు. దీంతో ఈ పాక్ పేసర్ కు పట్టరాని కోపం వచ్చింది. కోపంగా అతని దగ్గరకు దూసుకెళ్లి అతన్ని కొట్టబోయాడు. పక్కనే ఉన్న తన భార్య ఆపే ప్రయత్నం చేస్తున్నా హారిస్ రౌఫ్ వినిపించుకోలేదు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడే ఉన్న  సెక్యూరిటీ రౌఫ్ ను నిలువరించడంతో గొడవ ఆగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హారిస్ రౌఫ్ తన ఫ్యామిలీతో కలిసి లండన్ కు వెళ్లనున్నాడు. రౌఫ్ తో పాటు బాబర్ అజామ్, మహ్మద్ అమీర్, ఇమాద్ వసీం, షాబాద్ ఖాన్, ఆజం ఖాన్ జట్టుతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లడం లేదు. ఈ ఆరుగురు లండన్‌లో తమ కుటుంబం, స్నేహితులతో సమయం గడపాలని నిర్ణయించుకున్నారట. టీ20 వరల్డ్ కప్ 2024 లో హారిస్ రౌఫ్ 7 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు.