- జమ్మికుంట దళిత మోర్చా సదస్సులో ఈటల రాజేందర్
- దళితులను అడుగడుగునా కేసీఆర్ దగా చేస్తున్నరు
- మేకల్లా కాదు.. పులుల్లా బతకాలని ప్రజలకు హితవు
- 48 గంటల్లోగా అందరికీ దళితబంధు ఇయ్యాలని సర్కార్‌కు డిమాండ్
జమ్మికుంట, వెలుగు: రాష్ట్రం సాధించుకున్నప్పటి నుంచి దళితులను అడుగడుగునా సీఎం కేసీఆర్ దగా చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్‌కు వాళ్ల ఓట్ల మీదున్న ప్రేమ.. వారి అభివృద్ధిపై లేదని విమర్శించారు. నచ్చనివారిని అణచేసి బయటకు వెళ్లగొట్టడం కేసీఆర్‌కు అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీటుకు సూటిపెట్టేందుకు తాను ప్రయత్నించినట్టు హరీశ్ ఆరోపిస్తున్నారని, కానీ, అసలు కేసీఆర్ సీటుకు ఎసరు పెట్టింది హరీశ్, కేటీఆరేనని అన్నారు. నోరెత్తితే అబద్ధాలు తప్ప.. ఎప్పుడూ నిజం చెప్పని కుటుంబం వారిదని ఆరోపించారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన దళిత మోర్చా సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, కర్నాటక ఎంపీ మునుస్వామి, పార్టీ నేతలు బొడిగె శోభ, చంద్రశేఖర్, బాబూమోహన్ తదితరులు పాల్గొన్నారు. దళితుల సమస్యలపై కొట్లాడేందుకు తాను సిద్ధమని ఈటల అన్నారు.
నా ప్రచారంలో డప్పు కొట్టినోళ్లకు..దళితబంధు ఇవ్వరట
హుజూరాబాద్‌లో తనను ఓడిస్తే 20 ఏండ్ల పాటు తిరుగుండదని కేసీఆర్ భావిస్తున్నారని ఈటల అన్నారు. తన ప్రచారంలో డప్పులు కొట్టేవాళ్లకు దళితబంధు ఇవ్వరంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది ఇప్పటికే ఉన్న పథకమని ఎన్నికల సంఘం ప్రకటించింది కాబట్టి.. 48 గంటల్లోగా దళితులందరికీ పథకాన్ని వర్తింపజేసి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలయ్యాక దీనిపై పోరాడుతానన్నారు. ఏదైనా కొట్లాడితేనే వస్తుందన్నారు. ‘బానిసత్వంలో మగ్గొద్దు.. నీ బాంచెన్ అనొద్దు.. మేకల్లాగా కాదు.. పులి బిడ్డలా బతకాలె. మేకల్లా ఉంటే కోసుకుతింటరు. పులిబిడ్డలా ఉంటే భయపడిపోతరు’ అని చెప్పారు.
ఆరేండ్ల నరకం నుంచి బయటపడిన
ఐదారేండ్ల నుంచి టీఆర్ఎస్లో నరకం అనుభవిస్తున్నానని, దాని నుంచి బయటపడ్డందుకు సంతోషంగా ఉందని ఈటల అన్నారు. తన లాంటి వాళ్లను బయటకు పంపించేందుకు 2018లోనే కేసీఆర్ కుట్రలు పన్నారని ఆరోపించారు. తాను గొంతెత్తి మాట్లాడిన తర్వాతే హరీశ్‌కు రెండోసారి మంత్రి పదవి దక్కిందన్నారు. పార్టీలో అవమానాలు జరిగిన మాట నిజమో..కాదో హరీశ్ చెప్పాలని డిమాండ్ చేశారు. పదవుల కోసం హరీశ్ నోరు మూసుకుంటే.. తాను మాత్రం గొంతెత్తానని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ కేసీఆర్ చెప్పింది నిజం కాదా అని ఈటల ప్రశ్నించారు. ఇద్దరికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి తీసేశారని మండిపడ్డారు. 0.2 శాతం ఉన్న కేసీఆర్ కులం వాళ్లకు ఎన్నో మంత్రి పదవులిచ్చారని, ఎస్సీల జనాభాకు తగ్గట్టు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వట్లేదని నిలదీశారు. ఏడేండ్లు ఒక్క దళిత ఆఫీసర్ లేకుండా కేసీఆర్ పాలన చేశారని, తాను మాట్లాడాకే ఒకరిని సీఎంవోలో నియమించారని గుర్తు చేశారు. ప్రదీప్ చంద్ర అనే సీఎస్ రిటైర్మెంట్ ఫంక్షన్‌కు కేసీఆర్ రాలేదని, దళిత బిడ్డ కాబట్టే రాకుండా అవమానించారని ఆరోపించారు. దళితుల గురించి మాట్లాడినందుకే భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆకునూరి మురళిని ట్రాన్స్ఫర్ చేశారని అన్నారు. కాగా, మైనారిటీల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని జమ్మికుంట స్వాతి గార్డెన్లో జరిగిన మైనారిటీల సదస్సులో ఈటల అన్నారు. మైనారిటీబంధును ప్రవేశపెట్టి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్ పంచాంగం విప్పుత: బాబూమోహన్
ఈ నెల 15 తర్వాత సీఎం కేసీఆర్ పంచాంగం చిట్టా విప్పుతానని బాబూమోహన్ అన్నారు. కేసీఆర్ కుటుంబమంతా దళిత వ్యతిరేకులేనని అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితుల్నిపోలీసులతో కేసీఆర్ కొట్టించారని గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు కోసం దళితులంతా కృషి చేయాలని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. కేసీఆర్ దళిత ద్రోహి అని ఇప్పటికే ఎంతో మంది చెప్పారన్నారు. కేసీఆర్జీవితమే అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. మోసాలు చేయడంలో రాష్ట్రంలోనే ముందువరుసలో ఉంటారన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 మంది దళితులను కేబినెట్లోకి తీసుకుందని, ఓ దళితవ్యక్తిని రాష్ట్రపతి చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ మాత్రం తన కేబినెట్లో ఒక్కరికే అవకాశం ఇచ్చారన్నారు. తన కుటుంబంలోని వాళ్లకు మాత్రం 6 పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. టీటీడీ బోర్డులో కేసీఆర్ కుటుంబం నుంచే ఆరుగురికి సభ్యులుగా అవకాశం ఇప్పించారని, ఒక్క దళితుడికైనా ఆ పదవి ఇప్పించలేదని మండిపడ్డారు. అప్పట్లో దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని, ఎకరాకు రూ.5 లక్షలు పెట్టి కొనిస్తానని చెప్పాడని, కానీ, ఇప్పుడేమో అసలు చెప్పలేదంటున్నారని వివేక్ విమర్శించారు. దళితుల్లో ఎక్కువ మంది కౌలు రైతులేనని, కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న వాళ్లంతా కౌలురైతులేనని చెప్పారు. ఆనాడే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చి ఉంటే దాని విలువ ఇప్పుడు రూ.50 లక్షలు అయ్యి ఉండేదని, డబుల్ బెడ్రూం ఇండ్లిస్తే రూ.15 లక్షలు అయ్యేదని అన్నారు. ఇప్పుడు దళితబంధు డబ్బులు వేసినట్టే వేసి అకౌంట్లను ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఎప్పుడైనా దళిత వ్యతిరేకేనని విమర్శించారు. ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ దిగొచ్చి దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాడని చెప్పారు. ఆ తర్వాత మైనారిటీల సదస్సులో పాల్గొన్న ఆయన.. మైనారిటీల శ్రేయస్సు కోసం పాటుపడతామని చెప్పారు. తన తండ్రి వెంకటస్వామి ఎప్పుడూ షేర్వాణీ వేసుకునేవారని గుర్తు చేశారు. తన కంపెనీల్లో మైనారిటీలకు చాలా అవకాశాలు కల్పించానని చెప్పారు.