![నీళ్ల కోసం మరో పోరాటం చేయాలి...బీఆర్‌ఎస్ కార్యకర్తలకు హరీశ్ రావు పిలుపు](https://static.v6velugu.com/uploads/2025/02/harish-rao-accused-congress-government-of-undermining-sangameshwara-and-basaveshwara-irrigation-projects_Y5XMWg6Era.jpg)
హైదరాబాద్, వెలుగు: నీళ్ల కోసం మరో పోరాటా నికి సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఆ రెండు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేదాకా ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో హైదరాబాద్‌లోని తన నివాసంలో హరీశ్ సమావేశమయ్యారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. ఈ రెండు ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో ఆ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్, ఆందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల సాగు నీరు కలగానే మిగిలిందన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టించుకోని ప్రభుత్వంలో కదలిక తెచ్చి, వాటిని పూర్తి చేయించి 4 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.