
- నీళ్లను అక్రమంగా తరలించుకుపోవాలని చూస్తున్నడు: హరీశ్‌రావు
- నాడు కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖలు రాసిండు
- బనకచర్ల ప్రయత్నాలను ఖండిస్తున్నం
- కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తే 655 టీఎంసీలు వాడేశారు
- రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నరు?
- తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్సేనని వ్యాఖ్య
సిద్దిపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అండతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. చంద్రబాబు కుట్రలకు బీజేపీ వత్తాసు పలుకుతున్నదని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. బుధవారం సిద్దిపేట క్యాంపు ఆఫీసులో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు.
తెలంగాణ నీటి హక్కుల కోసం ఎప్పటికీ పోరాటం చేసేది బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్రానికి, సీడబ్ల్యూసీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.‘‘మీకు(చంద్రబాబుకు) రెండు రాష్ట్రాలు రెండు కండ్లయితే.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టి, కుడి కాల్వ నుంచి నిండుగా నీళ్లు తీసుకపోవడం సమ న్యాయమా?” అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో ఏపీకి తాత్కాలిక వాటా ప్రకారం 512 టీఎంసీలు కేటాయిస్తే 655 టీఎంసీల నీళ్లు వాడారని, తెలంగాణకు 343 టీఎంసీ రావాల్సి ఉన్నా వచ్చింది 220 టీఎంసీలేనని తెలిపారు.
‘‘ఢిల్లీలో చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి తెలంగాణ నోరు కొట్టి నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి రోజుకు రెండు టీఎంసీలు నీరు తీసుకుపోతూ తెలంగాణకు సాగు, తాగు నీరు లేకుండా చేస్తున్నడు. గతంలో దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, బీమా కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. చంద్రబాబు ది పక్షపాత ధోరణి” అని హరీశ్ మండిపడ్డారు.
కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరి నదిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో 240 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును, 65 టీంఎంసీలతో సీతమ్మసాగర్ ను, 47 టీఎంసీలతో సమ్మక్కసాగర్ను, 12 టీఎంసీలతో వార్దా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే చంద్రబాబు సీఎం కాగానే ఒక్కో ప్రాజెక్టు డీపీఆర్ లు వాపస్ వస్తున్నాయని ఆయన అన్నారు.
బనకచర్ల ద్వారా 200 టీఎంసీలను గోదావరి నుంచి పెన్నా బేసిన్ కు తరలించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదని చంద్రబాబు చెప్తున్నారని, కానీ దానికి వ్యతిరేకంగా గతంలో కేంద్రానికి ఆయన పలు లేఖలు రాశారని హరీశ్ పేర్కొన్నారు. ఆ లేఖలను విడుదల చేశారు.
చూస్తూ ఊరుకోం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్ల, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది” అని హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే దైర్యం, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదని దుయ్యబట్టారు. ‘‘ఢిల్లీని చూస్తే రేవంత్ కు భయం.. చంద్రబాబు పట్ల గురుదక్షిణతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల చంద్రబాబు తన పలుకుబడితో కేంద్రం నుంచి డీపీఆర్ లు వాపస్ వచ్చేలా చేసిండు.
చంద్రబాబును ఎదిరించి రేవంత్‌రెడ్డి ప్రాజెక్టులు సాధిస్తడా? అక్రమ ప్రాజెక్టులను ఆపగలుగుతాడా?” అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు, వైస్ జగన్ ది ఒకే బాట అని హరీశ్‌రావు విమర్శించారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డికి ఏమీ చేతకావడం లేదు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు” అని దుయ్యబట్టారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.