జహీరాబాద్, వెలుగు: గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం మోగడంపల్లి మండలం ఉప్పర్ పల్లి తండా పరిధిలోని మోతీమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మోతీమాత ఆలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం, తాగునీటి వసతి, రహదారి, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుచేశామన్నారు. కేసీఆర్ గిరిజనులకు10 శాతం రిజర్వేషన్ కల్పించి విద్య, ఉద్యోగాల్లో అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి తాగునీటి వసతులు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్ గిరిజన బంధుకింద రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ నేటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. విదేశాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేసిందన్నారు. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింత ప్రభాకర్, డీసీఎంహెచ్ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణ, రవికిరణ్ పాల్గొన్నారు.