- జీ హుజూర్ రాజకీయాలు నడ్వయ్ ..
- పదవుల కోసం ఈటల ఆత్మగౌరవాన్ని పక్కకు పెట్టిండు: హరీశ్‌రావు
జమ్మికుంట, వెలుగు : హుజూరాబాద్‌లో జీ హుజూర్ రాజకీయాలు నడవయని, పదవుల కోసం ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి బీజేపీతో ఈటల రాజేందర్ చేతులు కలిపారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఆయన ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మంత్రి హరీశ్ మాట్లాడారు.
కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోయి గోసపడతామని, ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వనని చెప్పిన ఆయనే నేడు ఈటలకు ముఖ్య సలహాదారుడిగా ఉన్నారని, సమైక్యవాదులతో ఈటల చేతులు కలిపారని ధ్వజమెత్తారు. ఉపఎన్నికలో గెలుపు కోసం ఇక్కడ ఎమ్మెల్యే అనేకసార్లు అబద్ధాలు మాట్లాడారని, బీజేపీకి రాష్ట్రంలో మూడు సీట్లు కూడా రావన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్ద లీడర్లకు మన భాష రాదని అలాంటివారు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఏం చేయని నాయకుడు గజ్వేల్ ను ఉద్దరించాలని అక్కడ నామినేషన్ వేయడం విడ్డూరంగా ఉందని, రెండు చోట్ల నిలబడ్డ ఈటల రెంటికి చెడ్డ రేవడి అవుతారని విమర్శించారు.
కౌశిక్ రెడ్డిని గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సిద్దిపేటలాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ వస్తే అన్నం తినలేదు అన్న పవన్ కల్యాణ్‌తో బీజేపీ పార్టీ పొత్తుపెట్టుకున్నదని, అలాంటి వారికి ఓటు వేయడం అవసరమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తామని, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని హామీ ఇచ్చారు.
అభ్యర్థులకే గ్యారంటీ లేదు
టికెట్లు ఇచ్చిన వారికే గ్యారంటీ లేక కాంగ్రెస్ వాటిని తిరిగి తీసుకుంటోందని, కర్నాటకలో ఇలాంటి హామీలే ఇచ్చి అధికారంలోకి రాగానే ఐదు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నట్లు అక్కడి రైతులు తెలిపారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వే రిపోర్టుల్లో పాడి కౌశిక్ రెడ్డి గెలుపు ఖాయమని చెప్తున్నాయన్నారు.
హుజూరాబాద్ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడు పాటుపడలేదని, ఉప ఎన్నికలో గెలిచిన ప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం పైసా తీసుకురాలేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సీఎం మంచి పేరు తెచ్చుకున్నాడని, క్రికెట్లో ఆల్‌రౌండర్‌గానే కాకుండా రాజకీయాల్లో కూడా కౌశిక్ ఆల్‌రౌండర్‌గా ముందుకు దూసుకుపోతున్నారని కొనియాడారు. కేసీఆర్ మాట ఇస్తే మడమ తిప్పకుండా పనిచేసే గొప్ప కార్యదీక్షపరుడని వివరించారు.