ఫ్రస్ట్రేషన్​లో కేటీఆర్, హరీశ్..ఇద్దరిది తలో మాట

ఫ్రస్ట్రేషన్​లో కేటీఆర్, హరీశ్..ఇద్దరిది తలో మాట

బీఆర్ఎస్​లో  ముఖ్యమైన ఇద్దరు నాయకులు చేస్తున్న  ప్రకటనలు, వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి.  ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు 100 సీట్లు గ్యారెంటీ’ అని హరీశ్ రావు అంటున్నారు. మరోవైపు ‘పార్టీ కార్యకర్తల కోరిక మేరకు  త్వరలో రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తా’ అని కేటీఆర్ అంటున్నారు. ఈ రెండు  ప్రకటనలు ఒకదానికొకటి పొంతన లేనివి.  హరీశ్ రావు చెబుతున్నట్టుగా ఉన్నపళంగా ఎన్నికలు వచ్చే పరిస్థితులు తెలంగాణలో ఏమీ లేవు. రాజకీయ అనిశ్చితి లేదు. రాజకీయ సంక్షోభం అసలే లేదు.  కాబట్టి ఎన్నికలు జరిగే ఆస్కారం లేదు.  ఎన్నికలు వెంటనే రావాలని,  గెలిచి అధికారంలో కూర్చోవాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించడం వేరు.  నిజంగా ఎన్నికలు రావడం వేరు.  సాధారణ ఎన్నికలకు ఇంకా నాలుగేండ్ల సమయం ఉన్నది. 

హరీశ్ రావు కథనం ప్రకారమే ఒకవేళ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందనుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర నిర్వహించడం ఎందుకు?   అధికార లేమితో తీవ్ర మనోవ్యధకు గురవుతున్న బీఆర్ఎస్ నాయకులకు క్షణం ఒక యుగంలా గడుస్తోంది. విపరీతంగా అధికారాన్ని అనుభవించడం, అధికారం కోల్పోయే పరిస్థితి ఎప్పుడూ రాదనుకోవడం,  తామే ఎల్లకాలం అధికారంలో ఉంటామని అనుకోవడం, కేసీఆర్ లాంటి ఎదురులేని మనిషితో సరితూగే నాయకుడు లేడని నమ్మడం వల్ల గులాబీ నేతలు  మనోవేదన అనుభవిస్తున్నారు.  అధికారం పోగానే  నేల కింద భూమి కదిలిపోయినట్టుగా ఒక్కసారిగా కంపించిపోయారు. ఊహించలేని తుపాను మీద పడినప్పుడు, అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆత్మరక్షణ చేసుకోవడం అంత సులభం కాదు.  సరిగ్గా అటువంటి పరిస్థితినే బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నది.

మనోవ్యధకు గురవుతున్నారు!

‘తరచూ లభించే విజయం ప్రమాదకరం.  మితిమీరిన ఆత్మవిశ్వాసం అధికారంలో ఉన్నవారిని లక్ష్యాన్ని దాటి ముందుకు వెళ్లేలా చేస్తాయి. దాంతో  విజయగర్వం తలకెక్కుతుంది. అలా వారికి శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది’  అని 1469 -–1527 కాలంలో సుప్రసిద్ధ  రాజకీయ తత్వవేత్త  మాకియవెలి అన్నాడు.  కేసీఆర్ విషయంలో ఇదే జరిగింది. ఫెడరల్ ఫ్రంట్ పేరిట కార్యకలాపాలు, టీఆర్ఎస్​ను  బీఆర్ఎస్​గా మార్చి జాతీయ స్థాయిలో  చక్రం తిప్పాలనుకోవడంతో  పార్టీ కొంప మునిగింది.  తాము ఓడిపోతామని అనుకోకపోవడం వల్ల కేసీఆర్,  కేటీఆర్, హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రకరకాలుగా లబ్ధిపొందిన
వారు మనోవ్యధకు గురవుతున్నారు.  మరోవైపు తాము బద్ధ శత్రువుగా భావిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అసలే జీర్ణించుకోలేకపోతున్నారు. 

పాదయాత్ర వల్ల  గెలుపు సాధ్యమా?

పాదయాత్ర అనేది పురాతన ఆయుధం. కాలం చెల్లిన ట్రిక్కు. కాలగమనంలో ప్రజల అభిరుచులూ, ఆకాంక్షలూ మారుతున్నవి. ఉమ్మడి ఏపీలో..2003లో  వైఎస్.రాజశేఖరరెడ్డి జరిపిన పాదయాత్ర అప్పట్లో పెను సంచలనం. ఆ తరువాత చాలామంది పాదయాత్ర ఫార్ములాను అనుసరించినా కొందరికే గెలుపు వరించింది. పాదయాత్ర వల్లనే గెలుపు సాధ్యమైందన్న వాదన సరైంది కాదు.  పదేండ్లలో చేసిన తప్పులు గొంగట్లో మోస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగితే అధికారం వరిస్తుందని భావించడం పొరపాటు.

ఆధిపత్య పోరాటంలోభాగంగానే  కేటీఆర్​ పాదయాత్ర

మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లుగానే పాద యాత్ర మూలంగా అధికారం  లభించడం కూడా అంతే.   కేటీఆర్ పాదయాత్ర  ప్రకటన పెద్ద సంచలనం సృష్టించడం లేదు.  ప్రసార మాధ్యమాలు పెద్దగా లేని రోజులలో నాయకులను చూసేందుకు ప్రజలు ఎగబడి వచ్చేవారు. ప్రధానస్రవంతి మీడియాతో పాటు, సోషల్ మీడియా విజృంభణ కొనసాగుతున్న ఈ రోజుల్లో పాదయాత్రలకు ఆకర్షణ తగ్గిపోయిందన్న విశ్లేషణ ఉన్నది.  కేటీఆర్ పాదయాత్ర ప్రకటన బీఆర్ఎస్​లో ఆధిపత్య పోరాటంలో భాగమని ఆ పార్టీలోనే చర్చలు జరుగుతున్నవి.  రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో హరీశ్ రావు,  కేటీఆర్​ల మధ్య ఆధిపత్యం ఎవరిదన్న  మీమాంస పార్టీలో  కొనసాగుతున్నది.  ఈ రేసులో బహుశా ముందంజ కోసమే కేటీఆర్ పాదయాత్ర 'అస్త్రాన్ని'  సంధించి ఉండవచ్చు.  తన రాజకీయ వారసుడు  కేటీఆర్  మాత్రమే అనే విషయం  రుజువు చేయడానికి  కేసీఆర్  స్వయంగా వ్యూహం పన్ని కొడుకును  ప్రజల్లోకి పంపిస్తున్నారేమో!  

యువకుల బలిదానాలతోనే  తెలంగాణ

గోల్‌‌‌‌‌‌‌‌ కొట్టేది మేమే.  వికెట్‌‌‌‌‌‌‌‌ తీసేది మేమే.  కప్‌‌‌‌‌‌‌‌ గెలిచేదీ మేమే?  ఈ లోపు  హిట్‌‌‌‌‌‌‌‌వికెట్‌‌‌‌‌‌‌‌ కాకుండా చూసుకో.  నీ మంత్రులే నిన్ను  ఔట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నరు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీశ్ రావు అన్నారు.  ‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌ లేకపోతే తెలంగాణ వచ్చేదా?  రాష్ట్రం రాకుంటే  తెలంగాణకు  రేవంత్‌‌‌‌‌‌‌‌ ముఖ్యమంత్రి అవుతుండేనా?  రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పెట్టిన భిక్ష.  మళ్లీ సీఎం కేసీఆరేనని ప్రజలు డిసైడ్‌‌‌‌‌‌‌‌ అయ్యిండ్రు’ అని  హరీశ్ రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచార రథాన్ని నడిపిన రేవంత్ కు సీఎం పదవి ఆయన కష్టార్జితం. కేసీఆర్​ లేకపోతే తెలంగాణ ఆవిర్భావం అయ్యేది కాదని చేసే వాదన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు  సంతృప్తి కలిగించవచ్చు. శ్రీకాంతాచారి సహా ఎందరో యువకుల బలిదానాలే  తెలంగాణ ఏర్పడడానికి కారణమని ప్రజల్లో భావన బలంగా ఉన్నది.

రేవంత్​కే సాధ్యంకొన్ని నిర్ణయాల వల్ల  రేవంత్ పట్ల కొన్ని సెక్షన్ల

 ప్రజల్లో అసంతృప్తి  తలెత్తవచ్చు.  సీఎం పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు పార్టీ హైకమాండ్ పట్ల కొంత అసంతృప్తి ఉండవచ్చు. కానీ,  ఇవేవీ  రేవంత్​పై తిరుగుబాటుగా  మారే అవకాశాలు లేవు.   కేసీఆర్​ను,  ఆయన కుటుంబ సభ్యులను హ్యాండిల్  చేయడం రేవంత్​తో తప్ప  తమతో కాదని సీనియర్లకు కూడా తెలుసు. అన్నింటికీ అనుభవం అవసరం లేదు. పట్టుదల,  సంకల్పం ఉంటే సరిపోతుంది.  రేవంత్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని,  ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నదని ఆశపడి  బీఆర్ఎస్ చేస్తున్నది  స్వయం ప్రచారం మాత్రమే.  ప్రజలు బీఆర్​ఎస్​ నేతలను నమ్మే అవకాశం మాత్రం ఎక్కడా కనిపించదు. మొత్తం మీద హరీశ్​, కేటీఆర్​లుఫ్రస్ట్రేషన్​లో కొట్టుమిట్టాడుతున్నారని వారి చిట్​చాట్​లు,  ఎక్స్​లే  చెపుతున్నాయి.

హరీశ్​కు బీఆర్​ఎస్​లో ఉండక తప్పని పరిస్థితి

కేటీఆర్​కు ఇచ్చిన  ప్రాధాన్యం, ఆయనను వారసునిగా ఎలివేట్ చేస్తున్న వైనం హరీశ్ రావుకు 2015 నుంచే తెలుసు. 'ఇట్లు మీ విధేయుడు' గానే బీఆర్ఎస్ లో ఆయన ప్రయాణం కొనసాగుతున్నది. హరీశ్ రావు  కేసీఆర్ ను ధిక్కరించలేడు.  తిరుగుబాటు చేయలేడు.  అందుకే, ఒక దశలో పార్టీ నుంచి వెలుపలికి పంపించేందుకు ప్రణాళికలు వేసినా,  హరీశ్ రావు పార్టీని అంటిపెట్టుకొని ఉండక తప్పని పరిస్థితుల్లో ఉన్నాడు.  2023లో తెలంగాణ 'అసెంబ్లీ కప్' గెలుచుకొని విజేతగా రేవంత్ రెడ్డి నిలబడ్డారు.  బీఆర్ఎస్  అధినేత  కేసీఆర్ ఫార్మ్ హౌస్​ నుంచి ప్రజల్లోకి రాకుండా ఉండడం ఆ పార్టీకి మైనస్.  హరీశ్,  కేటీఆర్ ఎంత పోరాడినా  రావలసినంత  స్పందన రావడం లేదు. బీఆర్​ఎస్ సోషల్ మీడియాలో 'ఊపు' కనిపిస్తోంది.  కానీ,  చిట్ చాట్ లు, మీడియా సమావేశాలు, సభలు సమావేశాల వలన  రేవంత్ పై వ్యతిరేకత రావడం కష్టం. 

- ఎస్.కే. జకీర్,
సీనియర్ జర్నలిస్ట్​