- ఫస్టు తారీఖు జీతాలు ఇవ్వట్లేదంటూ ఎమ్మెల్యే ట్వీట్
- బీఆర్ఎస్ హయాంలో నెలల తరబడి ఇవ్వలేదంటూ మంత్రి కౌంటర్
- గత సర్కార్ తప్పులను తాము సరిచేస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ కార్మికులకు జీతాల విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, మంత్రి సీతక్క మధ్య శనివారం మాటల యుద్ధం సాగింది. జీతాలు సకాలంలో ఇవ్వకపోవడంతో చిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారని హరీశ్ ట్వీట్ చేయగా.. బీఆర్ఎస్ హయాంలో నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో పలువురు కార్మికులు ఆత్మహత్యలకు సైతం పాల్పడిన విషయం మరిచిపోయారా? అని మంత్రి కౌంటర్ ఇచ్చారు.
ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిరుద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని ముందుగా హరీశ్ ట్వీట్ చేశారు. ‘‘హామీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో జీతాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి కనిపించడం లేదా? నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా ఉపాధి ఉద్యోగులు, నెల గడిచినా మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు వేతనాలు అందక వెతలు పడుతున్నారు.
జీతాలు ఇవ్వాలని చిరుద్యోగులు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. నెలల తరబడి జీతాలు రాక చిరుద్యోగులు అప్పులపాలు అవుతున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హరీశ్ ట్వీట్ పై మంత్రి సీతక్క ఒక ప్రకటనలో స్పందించారు.
బీఆర్ఎస్ తప్పులను సరిదిద్దుతున్నాం..
పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కు హరీశ్ రావుకు లేదని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జీతాలు ఇవ్వకుండా అవస్థలకు గురి చేసి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ పాలనలో 2023, మార్చి 13న పంచాయతీ కార్మికులు కలెక్టరేట్ల ముందు వంటావార్పుతో నిరసన తెలిపిన విషయం మరిచారా? పంచాయతీ కార్మికులతోపాటు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు సహా వేలాది మంది చిరుద్యోగులను మీరు పట్టించుకోలేదు.
మీరు చేసిన తప్పులను ఇప్పుడు మేం సరిదిద్దుతున్నాం. గ్రామ స్థాయిలో చిరుద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతినెలా సకాలంలో జీతాలు చెల్లించే విధానాన్ని రూపొందించి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం” అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 92 వేల మంది పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జీతాలు ఇస్తామన్నారు. ఇప్పటికైనా అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు.