ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్: హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‎ను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పంజాగుట్ట పీఎస్‎లో తన మీద నమోదైన కేసు కొట్టివేయాలని హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని పిటిషన్‎లో పేర్కొన్నారు. 

నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో తన పేరును ఇరికించి నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, సిద్దిపేట కాంగ్రెస్ ఇంచార్జ్ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

ALSO READ : లగచర్ల ఘటన: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించడంతో పాటు తనను, తన కుటుంబ సభ్యులను బెదిరించాడని చక్రధర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.   హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేయించాడని చక్రధర్ ఫిర్యాదు చేశారు. చక్రధర్ కంప్లైంట్ మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. హరీష్ రావు క్యాష్ పిటిషన్‎పై హై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది.