‘హామీలను ఎగ్గొడుతం.. అందినకాడికి దోస్కుంటం’ అనే తీరుగా బడ్జెట్: హరీశ్ రావు

‘హామీలను ఎగ్గొడుతం.. అందినకాడికి దోస్కుంటం’ అనే తీరుగా బడ్జెట్: హరీశ్ రావు
  • వాస్తవ దూరంగా రాష్ట్ర బడ్జెట్
  • పద్దులో చూపిన అంకెలకు, వాస్తవ లెక్కలకు పొంతన లేదు: హరీశ్​రావు
  • ‘హామీలను ఎగ్గొడుతం.. అందినకాడికి దోస్కుంటం’ అనే తీరుగా బడ్జెట్
  • మీ విధానాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు పడిపోతున్నది
  • భూములు అమ్మితే తప్ప హామీలు అమలుచేయలేని పరిస్థితి
  • ఆర్థిక మాంద్యం దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదు.. మీ బుద్ధిలో, ఆలోచనల్లోనే మాంద్యం 
  • బడ్జెట్పై ప్రసంగంలో సర్కారుపై విమర్శలు
  • హరీశ్ వ్యాఖ్యలపై భట్టి, శ్రీధర్ బాబు, వెంకట్​రెడ్డి ఫైర్ 
  • సబ్జెక్ట్ వదిలి రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్​వాస్తవ దూరంగా ఉందని, బడ్జెట్​లో చెప్పిన అంకెలకు, వాస్తవ లెక్కలకు పొంతన లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. ప్రభుత్వ చర్యలతో జీఎస్టీ, స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్​ఆదాయం తగ్గి, రాష్ట్రంలో వృద్ధి రేటు పడిపోయిందని,  అప్పులు చేసి, భూములు అమ్మితే తప్ప హామీలు అమలుచేయలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందని ఆరోపించారు. కేసీఆర్​ పదేండ్ల పాలనలో అద్భుతంగా పురోగమించిన రాష్ట్రం.. మీ ఏడాది పాలనలో దిగజారిందని హరీశ్​రావు అన్నారు.

శుక్రవారం ఉదయం అసెంబ్లీ స్టార్ట్ కాగానే బడ్జెట్​పై మాట్లాడేందుకు బీఆర్ఎస్​కు స్పీకర్​అవకాశం ఇచ్చారు. ఆ పార్టీ నుంచి హరీశ్ ప్రసంగించారు. ‘‘ఏమైనా అంటే ఆర్థికమాంద్యం అంటున్నారు.. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం మన ఒక్క రాష్ట్రానికే ఉన్నదా? ఆర్థికమాంద్యం ప్రపంచంలో లేదు.. దేశంలో లేదు.. మీ బుద్ధిలో, మీ ఆలోచనల్లో మాంద్యం ఉంది.. ఈ తగ్గుదలకు కారణం ఆర్థిక మాంద్యం కాదు .. ప్రభుత్వ మాంద్యం, ప్రభుత్వ వైఫల్యం’’ అని విమర్శించారు. కాగా, హరీశ్​రావు ‘బుద్ధిమాంద్యం’ వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. ఆయన తీరుపై మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, వెంకట్ ​రెడ్డి ఫైర్ అయ్యారు. బడ్జెట్​పై మాట్లాడేందుకు  అవకాశమిస్తే  సబ్జెక్ట్ ​వదిలి రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీలకే దిక్కు లేదు.. అందాల పోటీలా?

ఎన్నికల హామీలపై కాంగ్రెస్​ ఇచ్చిన బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిశాయని, గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలే అయ్యాయని హరీశ్ ​రావు ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు గానీ.. అందాల పోటీలు పెడ్తరా? అని ప్రశ్నించారు.  రెండు పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత మోసమే తమ వైఖరి అని కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం చెప్పకనే చెప్పిందని అన్నారు. ‘హామీలను ఎగ్గొడుతం.. అందినకాడికి దోసుకుంటం’ అనే తీరుగా బడ్జెట్​ ఉన్నదని కామెంట్​ చేశారు.   తమ సర్కారు హయాంలో పదేండ్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్​ డిపార్ట్ మెంట్​లో భారీగా రెవెన్యూ వస్తే.. గత  15 నెలల నుంచి తగ్గిపోయిందని అన్నారు.  జీఎస్టీ వృద్ధి రేటు,  వాహనాల విక్రయాల్లో భారీ తగ్గుదల ఉందని, దీనికంతటికీ ఆర్థిక మాంద్యం కారణమా? అని ప్రశ్నించారు. 

రుణమాఫీది ఓ విషాద గాథ 

ఇక రుణమాఫీది ఓ విషాద గాథ అని పేర్కొన్నారు. ‘‘స్టేట్ లెవల్ బ్యాంకర్ల మీటింగ్‌‌‌‌లో సంపూర్ణ రుణమాఫీకి కావాల్సింది. రూ. 49,500 కోట్లుగా చెప్పారు. ఒక్క ఏడాది అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే 41 వేల కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చని అన్నారు. భట్టి విక్రమార్క గత బడ్జెట్ ప్రసంగంలో  రూ. 31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లోనేమో  రూ. 20 వేల కోట్లు ఇచ్చాం అంటున్నరు. కానీ వాస్తవానికి అది  రూ. 15వేల కోట్ల నుంచి రూ. 16 వేల కోట్లు కూడాచేరలేదు. 

వాస్తవం ఏమిటంటే, రైతు ఇంటికి, బ్యాంకుకు మధ్య తిరుగుతూనే ఉన్నడు. చివరకు రైతుకు మిగిలింది ఒడవని దు:ఖం, తీరని అప్పు” అని వ్యాఖ్యానించారు. ఈ రోజుకూ వారికి రుణమాఫీ కాలేదని, ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదని అన్నారు. ‘‘మీ మధిరకు పోదామా? లేదా మా సిద్దిపేటకు వస్తారా? ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామోమీరే చెప్పండి. సంపూర్ణ రుణమాఫీ జరిగి ఉంటే క్షమాపణలు చెప్పడానికి నేను సిద్ధం? మీరు రెడీగా ఉన్నారా? ” అని భట్టి విక్రమార్కకు సవాల్​ విసిరారు. 

తమ పాలనలో గ్రోత్ రేట్ ఆకాశం వైపు చూస్తే,  ఈ సర్కారు పాలనలో పాతాళం వైపు చూస్తున్నదని అన్నారు. ‘‘దివాలా తీసింది రాష్ట్రం కాదు..  మీ ఆలోచనలు దివాలా.. మీరు అనుసరిస్తున్న విధానాలు దివాలా.. మొత్తంగా మీ పరిపాలన దివాలా” అని సర్కారుపై మండిపడ్డారు.  రాష్ట్రంలో  హామ్​ మోడల్ లో రోడ్లను అభివృద్ధి చేస్తామని బడ్జెట్ స్పీచ్ లో భట్టి చెప్పారని హరీశ్​ రావు గుర్తు చేశారు. ఈ మోడల్ లో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం కాంట్రాక్టర్లు భరించాలని, ఈ 60 శాతం అమౌంట్ కాంట్రాక్టర్లకు ఎలా చెల్లిస్తారో  చెప్పాలని డిమాండ్​ చేశారు.
 
సీఎం వ్యక్తిగత దూషణలు చేస్తున్నరు
వ్యక్తిగత దూషణలతో మార్చురీ కంపు కొడుతున్న సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేక జనం ఛీ కొడుతున్నారని హరీశ్​ రావు అన్నారు. చెవులకు చిల్లులు పడుతున్నాయి గానీ.. చేయూత పింఛన్లకు చిల్లి గవ్వ రాలడం లేదన్నారు.  ఇటీవల సీఎం రేవంత్​ ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నా.. ఒక్కనొక్కని తోడ్కలు తీస్త, బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుత’’ అని అన్నారని గుర్తు చేశారు. ‘‘నిండు సభలో చైర్​ను ఉద్దేశించి చెప్పగల సీఎం గారి సంస్కారం ఎంత గొప్పది? ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. శాసనసభ బయట ప్రశ్నిస్తే జైళ్లకు పంపిస్తారు. శాసనసభ లోపల ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్లగొడుతుంది ఈ ప్రభుత్వం.

ఇవాళ రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న ఒకే ఒక ఎర్రర్ కారణంగా, ప్రజలు టెర్రర్ ను చవి చూపిస్తున్నారు”  అని వ్యాఖ్యానించారు.  మీరు పెట్టగలిగే పూర్తిస్థాయి బడ్జెట్​లు నాలుగేనని, అందులో రెండు బడ్జెట్​లు పూర్తై పోయాయని  చెప్పారు. అంటే పుణ్యకాలం కాస్తా కరిగిపోతున్నది కానీ.. మీరు చూపించిన కలలు మాత్రం నిజమయ్యే దాఖలా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.  ప్రతికూల పాలసీలు, ప్రతీకార రాజకీయాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద నెగెటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయని,  రాష్ట్ర ఆదాయ వనరులు ఒక్కొక్కటిగా తగ్గిపోతున్నాయని తెలిపారు. తాము పెంచుతూ వచ్చిన ఆదాయాన్ని వాళ్లు (కాంగ్రెస్) తగ్గిస్తూ పోతున్నారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రైజింగ్​ పదమే లేదు..
బడ్జెట్​లో ఎక్కడా తెలంగాణ రైజింగ్​ అనే పదమే వినిపించలేదని హరీశ్​ రావు అన్నారు. ‘‘తెలంగాణ రైజింగ్ కాదు.. మీది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్. ఇది పూర్తి నిరుత్సాహపరిచే బడ్జెట్.రాష్ట్ర ఇన్​కమ్​ మీద ప్రతికూల ప్రభావం చూపించింది” అని సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం అంత కంతకూ క్షీణిస్తున్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పద్ధతి ప్రకారం ప్రభుత్వ భూములను తెగనమ్మాలని చూస్తున్నారని, ఎను ముల వారి పాలనలో ఎన్ని భూములు ఖతం పట్టిస్తరో అని ఎద్దేవా చేశారు.

‘‘గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేయడం ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే టీజీఐఐసీ భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్‌‌‌‌ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో రూ.20 వేల కోట్ల అప్పు తెస్తరట. ఇతర ఆస్తులు తాకట్టు పెట్టి మరో రూ.20 వేల కోట్ల అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా రు” అని ఆరోపించారు.

నాడు ప్రభుత్వ భూము లంటే పెద్దలిచ్చిన ఆస్తి.. తెలంగాణ జాతి సంపద.. ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుంది అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారని, కానీ.. అధికారంలోకి రాగానే భూముల విక్రయా లు చేపట్టారని అన్నారు. అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే భూముల అర్రాస్ పెడుతున్నారని తెలిపారు. నాడు ఫార్మాసిటీ కోసం భూ సేకరణ చేస్తే అడ్డంపడ్డోళ్లు.. నేడు ఫ్యూచర్​సిటీ కోసం ల్యాండ్స్​ లాక్కుంటున్నారని విమర్శించారు.