బ్రజేశ్ ట్రిబ్యునల్ ఆదేశాలు తాత్కాలిక విజయమే : హరీశ్ రావు

  • న్యాయమైన వాటా దక్కితేనే పూర్తి విజయం: హరీశ్ రావు
  • పదేండ్ల కేసీఆర్​ పోరాటం వల్లే సెక్షన్​3పై ట్రిబ్యునల్​ వాదనలని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం సెక్షన్​ 3 ప్రకారం తొలుత రాష్ట్రాల వాటాపైనే వాదనలు వింటామన్న బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​ ఉత్తర్వులు పాక్షిక విజయమేనని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కితేనే పూర్తి విజయం దక్కినట్లని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మంచి అడ్వకేట్లతో వాదనలు బలంగా వినిపించాలన్నారు. బ్రజేశ్​ కుమార్​ ఆదేశాలపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఇదంతా పదేండ్ల పాటు కేసీఆర్​చేసిన పోరాట ఫలితమని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది కేసీఆర్​ ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన విజయమన్నారు. కృష్ణా జలాల కేటాయింపులు ప్రాజెక్టులవారీగా కాకుండా రాష్ట్రాల వారీగానే ఉండాలని మొదటి నుంచీ కేసీఆర్​ వాదించారన్నారు. కానీ, ఆ ఘనతను కాంగ్రెస్​ పార్టీ తమ విజయంగా చెప్పుకోవడం భావదారిద్ర్యానికి నిదర్శనమన్నారు. విభజనచట్టం సెక్షన్​ 89ని తీసుకొచ్చిందే నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీ అని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో కాంగ్రెస్​ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తే.. దానిని సరిదిద్దేందుకు కేసీఆర్​కు పదేండ్ల కాలం పట్టిందన్నారు. నాడు సీఎం హోదాలో కేసీఆర్​ బ్రజేశ్​కుమార్​ ట్రిబ్యునల్​ ముందు హాజరై.. రాష్ట్రం తరఫున వాదనలు వినిపించారన్నారు.

సెక్షన్​ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్​ ఏర్పాటు చేయాలంటూ 2014లోనే కేసీఆర్​ ప్రభుత్వం లేఖ రాసిందని చెప్పారు. కానీ, కేంద్రం సెక్షన్​ 89 ప్రకారమే విచారణకు ఆదేశించడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లామని తెలిపారు. కేసు వెనక్కి తీసుకుంటేనే ట్రిబ్యునల్​కు సెక్షన్​ 3పై నివేదిస్తామని కేంద్రం షరతు పెట్టిందని, న్యాయ సలహా తీసుకున్నాకే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పడంతో కేసీఆర్​ పోరాటం చేశారని అన్నారు. చివరకు కేసు వెనక్కు తీసుకోవడంతో కేంద్రం సెక్షన్​ 3లో ఫర్దర్​ టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ జోడించిందన్నారు. ఆ పోరాటాల ఫలితమే ఇప్పుడు ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు