‘తడి బట్టలతోని ఇద్దరం కురుమూర్తి గుడికి పోదాం, వస్తవా రేవంత్ రెడ్డి?’: హరీశ్ రావు సవాల్

‘తడి బట్టలతోని ఇద్దరం కురుమూర్తి గుడికి పోదాం, వస్తవా రేవంత్ రెడ్డి?’: హరీశ్ రావు సవాల్

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. ‘తడి బట్టలతోని ఇద్దరం కురుమూర్తి గుడికి పోదాం, వస్తవా రేవంత్ రెడ్డి?’ అని హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ను ఛాలెంజ్ చేశారు. మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని  రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నాడని  హరీశ్ రావు మండిపడ్డారు. 

20 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టి 26 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, నీళ్ల మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టాక మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులు దగ్గరే పడుకొని కష్టపడి 6 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లిచ్చామని హరీష్ రావు చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేసింది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలని ఆయన ఆరోపించారు. 

ALSO READ | గుడ్ న్యూస్: రేపటి ( జనవరి 27 ) నుంచి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు సీఎం రేవంత్

మహబూబ్ నగర్ జిల్లాలోని పొలాల్లో కృష్ణా జలాలు పారించింది కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీ అని ఆయన మీడియాకు వివరించారు. ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్ను తిట్టుడు తప్ప రేవంత్ రెడ్డికి పాలన చాత కాదని, అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఈ రోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికే అని గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ను కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండని ఆయన విమర్శించారు.