
- పాలమూరు, డిండి లిఫ్టులను ఆపాలంటూ కేంద్రానికి లేఖలు
- సీతారామ, కొడంగల్ లిఫ్టులపైనా ఫిర్యాదులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాజెక్టులకు ఆది నుంచి ఏపీ సీఎం చంద్రబాబే అడ్డుగా నిలిచారు. తాము తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం పడట్లేదని వాదిస్తున్న బాబే.. ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే మన రాష్ట్రం కట్టే ప్రాజెక్టులపై కుట్రలకు పాల్పడ్డారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్, డిండి లిఫ్ట్, సీతారామ వంటి ప్రధాన ప్రాజెక్టులకు మోకాలడ్డేస్తూ కేంద్రానికి లేఖలు రాశారు.
మోడికుంటవాగు, చనాకా– కొరాట వంటి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టుకు అసలు కేటాయింపులే లేవని, శ్రీశైలం నుంచి నీటిని తోడుకునేందుకు ప్రాజెక్టును చేపట్టిందని 2015లోనే కేంద్ర జలశక్తి శాఖకు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీకి చంద్రబాబు ఫిర్యాదులు చేశారు. డిండి లిఫ్ట్ స్కీమ్‌నూ అనుమతులు లేకుండా కడుతున్నారని 2016లో కేంద్రానికి, సీడబ్ల్యూసీకి కంప్లయింట్ చేశారు. ఆ రెండు ప్రాజెక్టులను ఆపాలని చంద్రబాబు లేఖ రాశారు. ఇటివల సీతారామ ప్రాజెక్టుపైనా అక్కసు వెళ్లగక్కుతూ లేఖలు రాశారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ స్కీమ్ పైనా కృష్ణా బోర్డుకు లెటర్ రాశారు.
శ్రీశైలం నుంచి ఇప్పటికీ నీటి దోపిడీ
శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు అయిపోవస్తున్నా.. ఏపీ మాత్రం అక్కడి నుంచి నీటి తరలింపును ఆపడం లేదు. వారం క్రితం కృష్ణా బోర్డు మీటింగ్‌లో నీటి తరలింపును ఆపేస్తామని ఏపీ అధికారులు చెప్పినా.. అవన్నీ నీటి మీద రాతలే అయ్యాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి తరలింపును ఆపినా.. హంద్రినీవా నుంచి మాత్రం నీటిని తీసుకెళ్లిపోతున్నది.
రోజూ 1,650 క్యూసెక్కుల చొప్పున.. ఈ వారం రోజుల్లోనే ఐదారు టీఎంసీలను తరలించుకుపోయింది. కృష్ణా బోర్డు ముందు తెలంగాణ తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా.. నీటి దోపిడీని ఏపీ ఆపడం లేదు.ఈ దోపిడీని కొనసాగించేందుకే బోర్డు మీటింగ్‌ను పలుమార్లు వాయిదా వేయించింది.