పైసలను కాదు ప్రజలను నమ్ముకున్నాం: హరీష్ రావు

చండూరు (మర్రిగూడ), వెలుగు: కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి కాంట్రాక్టులకు ఆశపడడం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీశ్‌‌రావు విమర్శించారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో మంగళవారం నిర్వహించిన రోడ్‌‌షోలో ఆయన మాట్లాడారు. మునుగోడులో కూసుకుంట్ల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచినా రాజగోపాల్‌‌రెడ్డి ఎమ్మెల్యే అవుతాడే తప్ప అభివృ-ద్ధి చేయలేడన్నారు. రాజగోపాల్‌‌రెడ్డి పదవిలో ఉన్నప్పుడు ఎందుకు డెవలప్​ ​చేయలేదని ప్రశ్నించారు. 2003 మర్రిగూడలో పల్లె నిద్ర చేసిన సీఎం కేసీఆర్‌‌ ఇక్కడి ప్రజల బాధలు చూసి పరిష్కారానికి కృషి చేశారన్నారు. 

తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బండి సంజయ్‌‌, కిషన్‌‌రెడ్డి లేదన్నారు. తెలంగాణకు చెందిన మండలాలు ఏపీలో కలిపారని, కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చడం లేదని విమర్శించారు. బీజేపీ గెలిపిస్తే బాయికాడ మీటర్లు, ఇండ్లకు కరెంట్‌‌ బిల్లులు వస్తాయి తప్ప చేసేదేమీ లేదన్నారు. బీజేపీ లీడర్లు డబ్బును నమ్ముకుంటే.. తాము ప్రజలను నమ్ముకున్నామని చెప్పారు.