- సీఎం రేవంత్ గురుకులాల విజిట్ పై హరీశ్ రావు కామెంట్
- వికారాబాద్ గురుకుల విద్యార్థిని లీలావతికి పరామర్శ
హైదరాబాద్, వెలుగు: గురుకులాల బాట పట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మొక్కుబడి సందర్శనలు కాకుండా.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్‌చేశారు. ఫొటోలకు పోజులివ్వడం మానేసి.. మంచి బువ్వ పెట్టి పొట్టలు నింపితే చాలన్నారు. ప్రచారం కోసం కాకుండా పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించాలని కోరారు. ప్రతిపక్షం నిలదీస్తేనే ఇప్పుడు సీఎం, మంత్రులు గురుకులాల సందర్శనకు వెళ్లారని చెప్పారు.
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతి, ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌రావు శనివారం పరామర్శించారు. వాంకిడి గురుకుల విద్యార్థులకు చికిత్స అందించడంలో జరిగిన వైఫల్యం.. తాండూరు గురుకుల విద్యార్థులకు చికిత్స అందించడంలోనూ కనిపించిందని విమర్శించారు.
15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైతే మంచి చికిత్సను అందించలేదని ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో లీలావతి అనే విద్యార్థినిని నిమ్స్‌కు తరలించి చికిత్స చేస్తున్నారని చెప్పారు.బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారి ఆసుపత్రి బెడ్‌పై ఉండడాన్ని చూస్తే మనసుకు ఆవేదన కలుగుతున్నదన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజన బిడ్డలకు శాపం
ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డలకు శాపంగా మారుతున్నదని, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నదని హరీశ్ రావు మండిపడ్డారు. గురుకులాల్లో వరుస ఫుడ్పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. కనీసం సొంత జిల్లాలోని గురుకులాలనూ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఫుడ్‌పాయిజన్ కేసులు, కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులు కామన్ అయ్యాయన్నారు. విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయని, ఆ శాఖల్లో నిర్వహణ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆరోపించారు. చలికాలంలో కనీసం వేడి నీళ్లు లేవని, ఆ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామంటూ గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి..14వ తేదీ వచ్చినా అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు జీతాలు ఇవ్వలేదని హరీశ్ రావు తెలిపారు.
10 నెలలుగా అంగన్ వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులనూ ఇబ్బందులు పెడుతున్నదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నారన్నారు. ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలివ్వాలని డిమాండ్ చేశారు.