- సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీపై కాంగ్రెస్ నాయకులు తలాతోక లేకుండా, రోజుకో తీరుగా మాట్లాడడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఈమేరకు రుణమాఫీపై ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ పూర్తయినట్టు సీఎం చెబుతుంటే, పూర్తికాలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారని.. ఎవరి మాట నమ్మాలని ప్రశ్నించారు. ‘‘మొన్న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రూ.18 వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారు.
ఇందుకు భిన్నంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఇంకా రూ.12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామన్నరు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నరు. రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో,సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్ధం చెప్పారు. ఏకంగా 31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఏది నిజం. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలి.”అని హరీశ్ ప్రశ్నించారు.