కాంగ్రెసోళ్లు కేంద్రాన్ని పల్లెత్తు మాట అనట్లేదు: హరీశ్ రావు

కాంగ్రెసోళ్లు కేంద్రాన్ని పల్లెత్తు మాట అనట్లేదు: హరీశ్ రావు
  • బడే భాయ్.. చోటే భాయ్ బంధం మళ్లీ బయటపడింది
  • ప్రజల పక్షాన పోరాడుతామని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: బడే భాయ్.. చోటే భాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందని బీఆర్‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పల్లెత్తు మాట అనలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి కూడా బీజేపీని విమర్శించడం లేదన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కేంద్రం మొండి చెయ్యి చూపిస్తున్నా రాష్ట్ర సర్కారు ఏమీ అనడం లేదన్నారు. 

బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ.. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌‌తో సమాన దూరంలో ఉంటుందని చెప్పారు. తాము ప్రజల పక్షాన నిలబడి, రెండు పార్టీలపైనా పోరాటం చేస్తామన్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా.. కాంగ్రెస్‌‌ను విమర్శించిన దాని కంటే బీఆర్‌‌‌‌ఎస్‌‌పైనే ఎక్కువ విమర్శలు చేశారని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్‌‌‌‌ఎస్‌‌ మీద బురద జల్లుతున్నాయని ఆరోపించారు. సీతాఫల్‌‌మండిలో పెండింగ్‌‌లో ఉన్న ఎస్డీఎఫ్ నిధుల కోసం ఎమ్మెల్యే పద్మారావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పారు. 

హైస్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఒకేచోట ఏర్పాటు చేసేలా బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో రూ.32 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్ రాగానే ఆ నిధులు ఆగిపోయాయని, వాటిని విడుదల చేయాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేశామని వెల్లడించారు.