ఇది కూల్చివేతల సర్కార్​: హరీశ్

ఇది కూల్చివేతల సర్కార్​: హరీశ్
  • హైదరాబాద్ బ్రాండ్​ సహా అన్నీ కూల్చేస్తున్నరు: హరీశ్ రావు 

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్‌‌‌‌ది కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ సహా అన్నింటినీ కూల్చి వేస్తున్నారన్నారు. హైడ్రా పేరిట డ్రామాలు ఆడుతున్నారని, ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణభవన్ లో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. హైదరాబాద్‌‌‌‌లో సుమారు 4, 5 లక్షల నివాసాలు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌, బఫర్‌‌‌‌‌‌‌‌జోన్ పరిధిలో, నాళాల మీద ఉన్నాయని, వాటన్నింటినీ కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. హైడ్రా ఆఫీసు ఉన్న బుద్ధ భవన్‌‌‌‌ కూడా నాలా మీదనే ఉన్నదని, ముందు దాన్ని కూలగొట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సూచించారు.

‘‘జీహెచ్‌‌‌‌ఎంసీ బిల్డింగ్, ఎన్నికల కమిషన్ ఆఫీసు, నెక్లెస్‌‌‌‌ రోడ్డు పక్కన రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య భవనాలు, మీర్ ఆలం చెరువు, ఉప్పల్ చెరువు, రామంతపూర్ చెరువులో వెలిసిన టవర్లను కూడా కూల్చేస్తారా?’’ అని హరీశ్‌‌‌‌రావు ప్రశ్నించారు. తొలుత కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలని కూల్చాలని డిమాండ్ చేశారు. ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములను కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కందుకూరులోని సర్వే నంబర్‌‌‌‌ 9లో 385 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి అగ్రిమెంట్లు జరుగుతున్నాయన్నారు. తుక్కుగూడలో సర్వే నంబర్ 892/1లో 25 ఎకరాల భూమిని పేద రైతుల దగ్గర నుంచి బినామీల పేరుతో తీసుకుంటున్నారని ఆరోపించారు.