- ఖమ్మంలో వరద బాధితులకు పరామర్శ
- బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఖమ్మం టౌన్, వెలుగు:వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ‘‘రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ ఆ రెండు పార్టీలు ఇప్పుడు వరద బాధితులకు ఇచ్చింది గుండు సున్నా. రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు సంభవించినా బీజేపీ ఎంపీలు మౌనం వహిస్తున్నారు” అని మండిపడ్డారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ ను కోరారు. మంగళవారం ఖమ్మంలో మున్నేరు వరద బాధితులను హరీశ్ రావు పరామర్శించారు.
నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. మున్నేరు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ఏరియాలకు తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహించిందని హరీశ్ రావు మండిపడ్డారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గత మూడ్రోజుల నుంచి హెచ్చరించినా.. జిల్లాలోని మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. వరద వచ్చి మూడ్రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మండిపడ్డారు.
‘‘ఖమ్మం పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్.. నష్టాన్ని అంచనా వేయకుండా ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లారు. ఒక్కో ఇంట్లో రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు నష్టం జరిగింది. కానీ సీఎం మాత్రం రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు” అని ఫైర్ అయ్యారు. వరదల వల్ల 30 మంది చనిపోతే, 16 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం నివేదిక విడుదల చేసిందని అన్నారు. చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేతలపై దాడి..
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్నేతలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్నేతలు.. బొక్కలగడ్డ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. కాలనీల్లోకి వరద రాకుండా అప్పుడు చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా? అంటూ నిలదీశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ టైమ్ లో కొందరు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడడంతో హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
దీంతో బొక్కలగడ్డలోని బీకే నగర్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘర్షణలో బీఆర్ఎస్కార్యకర్తకు గాయాలు కాగా, మమత ఆస్పత్రికి తరలించారు. కాగా, వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తే దాడి చేస్తరా? ఇదేనా ప్రజాపాలన? అని హరీశ్ రావు ప్రశ్నించారు. దాడి ఘటనపై ఖమ్మం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.