
- ఆరు గ్యారంటీల ఊసే లేదుమహిళలకు నెలకు
- రూ.2,500 ఇవ్వకుండా అందాల పోటీలకు రూ.250 కోట్లు పెడ్తరా? అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర బడ్జెట్ మొత్తం అరచేతిలో వైకుంఠం, ఆద్యంతం అబద్ధాలేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బడ్జెట్బుక్కులో రెండు పేజీలు పెరిగాయే తప్ప.. అందులో పస లేదని విమర్శించారు. పేదల సంక్షేమానికి నిధులు పెరగలేదని చెప్పారు. ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చాక కూడా అబద్ధాలే చెప్పారని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారని, ఈ బడ్జెట్లో అయినా గ్యారంటీలు అమలు చేస్తారని ప్రజలు ఆశగా చూస్తే.. వారికి నిరాశే ఎదురైందన్నారు.
బుధవారం బడ్జెట్‌పై అసెంబ్లీ మీడియా సెంటర్ హాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. భట్టి బడ్జెట్ స్పీచ్ అంతా రాజకీయ ప్రసంగంలాగానే ఉందని, పచ్చి అబద్ధాలు చెప్పారని అన్నారు. ‘భట్టి బడ్జెట్.. బడా జూట్ బడ్జెట్’ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటు బయట, అటు అసెంబ్లీలో అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు. రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటికే రూ.20 వేల కోట్లు ఇచ్చామన్నారని, కానీ, ఆ వడ్డీ లేని రుణాలు కేవలం రూ.5 లక్షల వరకే వర్తిస్తున్నదని గుర్తు చేశారు.
మిగతా 15 లక్షలకు మహిళలే వడ్డీ కడుతున్నారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని బడ్జెట్లో చెప్పారని, కానీ తాము 6.47 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. దీనిపై చర్చకు రావాలని సర్కారుకు సవాల్ విసిరారు.
తులం బంగారానికి కేటాయింపులేవి?
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వకుండా.. అందాల పోటీల కోసం మాత్రం రూ.250 కోట్లు బడ్జెట్లో పెట్టారని హరీశ్‌రావు విమర్శించారు. కల్యాణలక్ష్మిలో తులం బంగారానికి కేటాయింపులు చేయలేదని అన్నారు. చేయూత కింద రూ.4వేల పింఛన్ అన్నారని, దానికి అతీగతీ లేకుండా పోయిందని మండిపడ్డారు. వృద్ధులు, గీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లనూ సర్కారు మోసం చేసిందని అన్నారు.
కొత్త పింఛన్ ఇవ్వలేదని, ఉన్న పింఛన్‌ను రెండు నెలలు ఎగ్గొట్టారని తెలిపారు. ఆరు పెండింగ్ ప్రాజెక్టులను, ఈ ఏడాది 12 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారని, కానీ, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని విమర్శించారు. తలసరి ఆదాయం తమ హయాంలో 12.4 శాతం ఉంటే.. కాంగ్రెస్ పాలనలో 9.6 శాతమే ఉందని చెప్పారు. ఎక్సైజ్ ద్వారా రూ.50 వేల కోట్ల రాబడి వస్తుందని ఆశిస్తున్నారని, అంటే బీఆర్ఎస్ హయాం కన్నా రూ.13 వేల కోట్లు ఎక్కువ అని అన్నారు.