
మెదక్/ పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ని ఎకరాలు ఉన్నా రూ.15 వేలే ఇస్తారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం మెదక్ టౌన్, రూరల్, హవేలి ఘనపూర్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం బుధవారం హవేలి ఘనపూర్ మండలం కుచన్‌పల్లిలోని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఫాంహౌజ్ లో, అలాగే పాపన్నపేటమండలంలోని లక్ష్మీనగర్ ఎస్ ఆర్ గార్డెన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణాలోనే మాత్రమే రైతులకు 24 గంటల కరెంట్ వస్తోందన్నారు. కర్నాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నాటకలో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందన్నారు. ఛత్తీస్ గడ్ లోఎకరాకు 13 క్వింటాళ్ల వడ్లు మాత్రమే కొంటారని, మన రాష్ట్రంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నామన్నారు. మెదక్ నుంచి ఆఫీసులు తరలింపు అనేది ఉత్తమాట అని, నాలుగు కొత్తవి తెస్తాం కానీ ఎందుకు వెళ్తాయన్నారు. అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
కేసీఆర్‌ను మరోసారి సీఎంను చేద్దామన్నారు. పార్టీ తల్లి లాంటిదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. పదేళ్ల కింద పాపన్నపేట ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పద్మా దేవేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు చెందిన ప్రజాప్రతినిధులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. మీటింగ్‌లో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జగపతి, పీఏసీఎస్ చైర్మన్ హన్మంత రెడ్డి, ఎంపీపీలు నారాయణరెడ్డి, యమున జయరాం రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.