
సిద్దిపేట: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్ల లాంటివని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో బుధవారం (మార్చి 5) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ గురించి, కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని చంద్రబాబు అన్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని.. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ 657 టీఎంసీల నీరు వాడుకుంటోందని తెలిపారు. సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడలేడు.. అలాగే చంద్రబాబును ఎదిరించే దమ్ము ఆయనకు లేదు.. ఎందుకు అంటే బాబు రేవంత్ గురువు కాబట్టి అని హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ, చంద్రబాబు కలిసి తెలంగాణను దెబ్బ కొట్టారని.. ఇద్దరు కలిసి రాష్ట్రంలో పంటలకు, తాగునీటి కొరత తెచ్చారని ఫైర్ అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ఆపడానికి ప్రయత్నాలు చేయలేదని చంద్రబాబు చెప్పడం ఎంత వరకు సమంజసం..? కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని ఉత్తరం రాయలేదా..? అలాగే.. పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్ట్‌లకు అనుమతులు నిలిపివేయాలని గతంలో చంద్రబాబు కేంద్రాన్ని కోరలేదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు హరీష్ రావు.
ఇప్పుడు ఏమి తెలియనట్లు తెలంగాణ ప్రాజెక్టులను నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్ధా, సీతమ్మ, కాళేశ్వరం మూడో టీఎంసీకి అనుమతి ఇవ్వడం మీకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రానికి ఉత్తరం రాయండి.. అప్పుడు మీరన్నట్లుగా మీకు రెండు రాష్ట్రాలు సమానమని నమ్ముతామని అన్నారు.
సమన్యాయం అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. మొన్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చెయ్యి చూపిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్‌ను తుక్కు కింద అమ్ముతుంటే ఎందుకు కేంద్రాన్ని ఆపమని అడగడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎలాగో చేత కాదు.. రెండు రాష్ట్రాలు రెండు కళ్లతో సమానమన్న మీరైన తెలంగాణ జరుగుతోన్న అన్యాయంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.