పది నెలల పాలనలో రాష్ట్రం పదేండ్లు వెనక్కి: హరీష్రావు

  • ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నరు?: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పది నెలల పాలనలో రాష్ట్రం పదేండ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే వరంగల్​లో విజయోత్సవాలు జరుపుకుంటున్నారని మండిపడ్డారు. జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని.. అపజయోత్సవాలని మంగళవారం ప్రకటనలో విమర్శించారు.

 ‘‘వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఏమైంది? డిక్లరేషన్​లో ఇచ్చిన మొదటి హామీ రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదు. రూ.15వేల రైతు భరోసాకు దిక్కులేదు. ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్న రూ.12వేలు ఏమైనయ్? పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్​ను బోగస్ చేసిన్రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇందుకేనా విజయోత్సవ సభ? అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి ఏర్పడింది. 

బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్​గా రోడ్ల మీదకు తెచ్చిన్రు’’అని హరీశ్ మండిపడ్డారు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి ఏడాదైందని, ఇప్పటికైనా కండ్లు తెరవాలని చురకలు అంటించారు. అద్భుతాలు చేశామనే భ్రమ నుంచి బయటికొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పది నెలల పాలనలో రేవంత్ నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదని మండిపడ్డారు. లగచర్లకు వెళ్లిన మహిళా సంఘాల నేతలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.