- చంద్రబాబుకు నిజమైన వారసుడు రేవంత్
- పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పరిస్థితి
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయం దండగ అన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిజమైన వారసుడని, అందుకే 3 గంటల కరెంట్ చాలు అని అంటున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జహీరాబాద్నియోజకవర్గ కాంగ్రెస్నాయకులు, రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తే తమ ఊరు, నియోజకవర్గం, జిల్లా బాగుపడుతదని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
సెన్సేషన్, బ్రేకింగ్ వార్తల కోసమే రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, వాటిని ప్రజలెవరూ పట్టించుకోరన్నారు. కాంగ్రెస్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. 2004 నుంచి పదేండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా? తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో కరెంట్ బాగుందా? అనే దానిపైనే ప్రజలను ఓట్లు అడుగుదామని సవాల్ విసిరారు. తాము ఫుల్లుగా కరెంట్ ఇస్తున్నందునే తొమ్మిదేండ్లలో అసెంబ్లీలో ఏ ఒక్కరూ కరెంట్ గురించి మాట్లాడలేదన్నారు.
అప్పట్లో పొన్నాల ఊర్లోనే కరెంట్ కోతలు
పొన్నాల లక్ష్మయ్య విద్యుత్‌శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఊరు కిలాషాపూర్లోనే మూడు గంటల కరెంట్వచ్చేది కాదని హరీశ్ అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలం అక్కడికి పోయినప్పుడు గంట గంటకు కరెంట్ ట్రిప్ అవుతోందని రైతులు గగ్గోలు పెట్టారని చెప్పారు. విద్యుత్‌శాఖ మంత్రి సొంత ఊరులోనే కరెంట్ఉండేది కాదని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో ఆరేడు గంటల కరెంట్కూడా రావడం లేదన్నారు.
ALSO READ :కింగ్ కార్లోస్ వింబుల్డన్ నెగ్గిన స్పెయిన్ స్టార్ అల్కరాజ్
కాంగ్రెస్.. తెలంగాణ వ్యతిరేకి
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకిగా ఉందని హరీశ్ అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఆంధ్రతో తెలంగాణను కలిపిందని, 1969లో తెలంగాణ ఉద్యమం చేస్తే 369 మందిని కాల్చి చంపింది కూడా కాంగ్రెసేనన్నారు. 2004లో గులాబీ జెండాతో పొత్తు పెట్టుకొని తర్వాత తెలంగాణ ఇవ్వబోమని ఎగనామం పెట్టింది కూడా ఆ పార్టీయేనన్నారు.
పోతిరెడ్డిపాడుకు పొక్కబెట్టి కృష్ణా జలాలను ఆంధ్రాకు అక్రమంగా ఇచ్చింది.. పులిచింతలకు పురుడు పోసింది.. పోలవరానికి ముగ్గు పోసింది.. తెలంగాణకు నీళ్లు లేకుండా చేసింది కాంగ్రెస్‌పార్టీయేనని ఆరోపించారు. నాడు లోకకల్యాణం కోసం రుషులు యజ్ఞాలు చేస్తే రాక్షసులు భగ్నం చేసేవారని.. ఇప్పుడు కేసీఆర్ రుషిలా రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే కాంగ్రెస్‌నేతలు భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.