
హైదరాబాద్, వెలుగు: హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కడం.. మాటిచ్చి మోసం చేసి నాలుక మడతేయడం సీఎం రేవంత్ కు అలవాటుగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రైతు భరోసా డబ్బులను మార్చి 31లోగా రైతులందరి ఖాతాల్లో వేస్తామని గొప్పగా ప్రకటించారని, బడ్జెట్ సమావేశాల్లోను ఊదరగొట్టారని గుర్తు చేశారు. కానీ, సీఎం మాటలు నమ్మి ఉగాది సమయంలో ఆశగా ఎదురు చూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైందని మంగళవారం ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. సీఎం రేవంత్మాటలు కోటలు దాటుతున్నా.. అడుగు మాత్రం గడప దాటడం లేదని చెప్పారు. సీఎం రేవంత్ రైతులను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని నిలదీశారు.
దసరాకిస్తమన్నరు, ఇవ్వలేదు. సంక్రాంతికి ఇస్తమన్నరు, ఇవ్వలేదు. ఉగాదికి ఇస్తామని ఊరించారు. రైతుల్ని ఉసూరుమనిపించారు. కానీ, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం.. కొత్త సంవత్సరాదిన రైతులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాట్ల సమయంలోనే కేసీఆర్రైతు బంధు ఇస్తే.. రేవంత్ మాత్రం కోతల టైం వచ్చినా రైతు భరోసా ఇవ్వట్లేదు. రుణమాఫీని దారుణ వంచనగా మార్చారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడడం లేదు. డేట్లు మారుతున్నాయి.. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప, రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. రైతు భరోసా ఇచ్చే దాకా నిలదీస్తూనే ఉంటాం’’ అని ఆయన పేర్కొన్నారు.