![ప్రామిస్ డే రోజున సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కీలక సూచన](https://static.v6velugu.com/uploads/2025/02/harish-rao-criticizes-cm-revanth-reddy_JPFx0wdfDt.jpg)
సిద్దిపేట: ఫిబ్రవరి 11న ప్రామిస్ డే.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు ఈ ప్రామిస్ డే సందర్భంగా నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. మంగళవారం (ఫిబ్రవరి 11) నంగునూర్ మండలం కొనాయిపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామి కేసీఆర్‌కు ఇష్టమైన దేవుడు.. ఆయన ఏ శుభకార్యం తలపెట్టినా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని అన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో కేసీఆర్ యాదాద్రితో సహా ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ 15 నెలల్లో దేవాలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల పట్ల చిన్నచూపు చూస్తున్నదని.. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని అన్నారు. 2024 ఆగష్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేస్తానని దేవుళ్ల మీద ఒట్టు వేసి ఇంతవరకు పూర్తి చేయలేదని మండిపడ్డారు.
ALSO READ | కులగణన సర్వే ఫారాలు పంపినం.. వివరాలు ఇవ్వండి: మంత్రి పొన్నం ప్రభాకర్..
ఏ అంశంలో చూసినా మాట ఇచ్చుడు.. మాట తప్పుడు సీఎం రేవంత్‌కు అలవాటని ఎద్దేవా చేశారు. వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా ఇప్పటిదాక పడలేదని.. కేసీఆర్ తెచ్చిన అనేక పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెట్టిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నైజం ప్రజలకు అర్థమైందని.. అందుకే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను దారుణంగా ఓడించారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని.. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాకే ఎన్నికలకు వెళ్లాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.