అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్‎కు PHD ఇవ్వాలి: హరీష్ రావు

అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్‎కు PHD ఇవ్వాలి: హరీష్ రావు

కరీంనగర్: ఆరు గ్యారంటీల మోసాన్ని గ్రహించి మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‎ను ఓడించారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకోవాలని, వందరోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజలను మోసం చేశారని.. అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీహెచ్డీ ఇవ్వాలని సెటైర్ వేశారు. 2024, నవంబర్ 24న కరీంనగర్‎లోని హుజురాబాద్‎లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. 

హుజురాబాద్‎లో 18500 మందికి కేసీఆర్  దళిత బంధు మంజూరు చేశారని.. వీరిలో కొందరికి ఆగిపోయిన ఐదు లక్షలు ఇవ్వమంటే వారిపై పోలీసులతో దాడి చేసి లాఠీ చార్జ్ చేయించారని ఫైర్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి దళితులకు చేసే మేలు ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే విడుదలైన దళిత బంధు డబ్బులను వాళ్లకు అందించాలని డిమాండ్ చేశారు. 2024, జులై 19న లగచర్లలో ఫార్మాసిటీ అంటూ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది.. కానీ  లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మార్చాడు.. ఇప్పుడు నీవు ఇచ్చిన గెజిట్‎పైనే అబద్ధాలు ఆడుతున్నావని విమర్శించారు.

ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ గెజిట్ వెనక్కి తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించాలని.. ఆ జీవో రద్దు చేసి కొత్త గెజిట్ ఇస్తేనే ప్రజలు నమ్ముతారని అన్నారు.ల గచర్లలో పచ్చని పంటలు పండే భూములను తొండలు గుడ్డు పెట్టని భూములుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాలేశ్వరం కూలిపోయిందని చెబుతున్న ప్రభుత్వం.. 20 టీఎంసీల నీటిని అదే ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‎కు ఎలా తీసుకోస్తోందని నిలదీశారు. 

మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ కాలేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టులోని 39 కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్ మాత్రమేనని.. అందులో రెండు పిల్లర్లకు మాత్రమే డామేజ్ జరిగిందని.. కానీ దీన్ని  కొండంత చేసి గోబెల్ ప్రచారం చేశారని సీరియస్ అయ్యారు. హుజురాబాద్‎లో దళిత సోదరులపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నామని.. దళిత బంధు అకౌంట్‎ల ఫ్రీజింగ్ ఎత్తివేసి వారికి డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 నుంచి జరిగే అసెంబ్లీలో దళితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు.