
హైదరాబాద్: మహిళ సంఘాలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.. నిజంగా రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మహిళ దినోత్సవం రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి తన అబద్ధాల పరంపర కొసాగించారని ఎద్దేవా చేశారు. మహిళ సంఘాలకు గత 11 నెలల కాలంలో ఒక్క పైసా వడ్డీ లేని రుణం కూడా విడుదల చేయలేదని అన్నారు.
మహిళ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం (మార్చి 9) తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళ దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిజాలు మాట్లాడాలని హితవు పలికారు.
ALSO READ | మా శాఖకు కేంద్ర బడ్జెట్ లో నిధులు ఎందుకివ్వలేదు..? ఇందిరాపార్క్ వద్ద గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు ధర్నా
మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాం అనేది అవాస్తవమని.. నిన్నటి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాటలు వినలేక మహిళలు వెళ్లిపోతుంటే పోలీసులు అడ్డుకున్నారని ఎద్దేవా చేశారు. గతంలో మా ప్రభుత్వం యూనిఫాం కుట్టేందుకు మహిళ సంఘాలకు రూ.50 చొప్పున ఇచ్చాం.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అవే రూ.50 ఇచ్చారని మహిళలు చెబుతున్నారు. కానీ రూ.75 ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధానికి ప్యాంట్, షర్ట్ వేస్తే సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.