
సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామంలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను శనివారం (ఏప్రిల్ 12) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట్ చిన్నకోడూరు మండలంలో రుణమాఫీ జరిగిన రైతులు 5,300 మంది ఉంటే.. ఇంకా 7,352 మందికి రుణమాఫీ జరగలేదన్నారు.
రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా.. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చెల్లిస్తామని బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపించిందని.. ప్రభుత్వం నిజంగా పంటల బీమా చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదని విమర్శించారు.
ఆకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని, వచ్చే వాన కాలంలో విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, 25 వేల ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెట్లు నరికే రేవంత్ రెడ్డి.. చెట్లు నాటే వనజీవి రామయ్యకు సంతాపం తెలపడం అంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు పనుల వల్ల అధికారులు బలయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఉద్యోగాలు పోయి అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు.