హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రజాపాలనపై జనం ఎంత ఆగ్రహంతో ఉన్నారో గ్రామసభలతో తేలిపోయిందని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జనం ఊరూరా తిరగబడుతున్నారని, ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని మంగళవారం ట్వీట్ చేశారు. ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ మొత్తం నిలదీస్తున్నదని, వారిపై ఎన్ని కేసులు పెడతారని నిలదీశారు. కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ పార్టీ చెబుతున్నవన్ని అబద్ధాలేనని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తేల్చేసినట్లు హరీశ్ వెల్లడించారు. నీటి వాటాలు తేల్చేంత వరకు 50:50 కేటాయించాలని 2015లో కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరిందని గుర్తుచేశారు. ఇవన్నీ దాచినా..దాగని సత్యాలన్నారు. కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని హరీశ్ రావు పేర్కొన్నారు.