తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్

తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్
  • జీఎస్టీ వసూళ్లు తగ్గినయ్‌‌‌‌‌‌‌‌‌‌: హరీశ్ రావు
  • రేవంత్  పాలనా వైఫల్యానికి ఇదే నిదర్శనమని విమర్శ

హైదరాబాద్, వెలుగు: రేవంత్ సర్కారు చేస్తున్నది తెలంగాణ రైజింగ్ కాదని, తెలంగాణ ఫాలింగ్ అని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. గత ఆరేండ్లలో ఫిబ్రవరి జీఎస్టీ కలెక్షన్ల వృద్ధి రేటు ఎప్పుడైనా 6 శాతం కన్నా ఎక్కువే నమోదైందని, కానీ, రేవంత్ పాలనలో మాత్రం కరోనా టైంను గుర్తుచేస్తూ కేవలం ఒక్క శాతమే వృద్ధి నమోదైందని గురువారం ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, ఇది రేవంత్ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు.

హైడ్రా, మూసీ వంటి తలా తోక లేని నిర్ణయాల వల్ల 2024 ఆగస్టు తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గింది. 2023 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య అమ్ముడైన వాహనాలతో పోలిస్తే 2024 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య అమ్ముడైన వాహనాల వృద్ధి రేటు కేవలం 0.8 శాతమే. జీఎస్టీ ఆదాయంలో తక్కువ వృద్ధి రేటు, రిజిస్ట్రేషన్లు, వెహికల్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లో నెగెటివ్ వృద్ధి రేటు నమోదైంది’’అని అన్నారు. మరోవైపు, విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు స్కాలర్ షిప్ రాక బాధపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. 

ఇదే విషయంపై గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. స్కాలర్ షిప్‌‌‌‌‌‌‌‌ల బకాయిల విడుదలకు మార్చి వరకు టైమ్‌‌‌‌‌‌‌‌ ఉందని మంత్రి సీతక్క సమాధానం చెప్పారని గుర్తుచేశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై సర్కారుకున్న శ్రద్ధ.. పేద విద్యార్థుల చదువుల బకాయిల చెల్లింపులపై మాత్రం లేదన్నారు.