రేషన్​కార్డు లబ్ధిదారుల ఎంపిక గ్రామాల్లో జరగాలి

  • కుల గణన లిస్టు ప్రకారం కార్డులు ఇచ్చుడేంది?: హరీశ్​రావు
  • ప్రజాపాలన, మీసేవ దరఖాస్తులనూ పరిశీలించాలి
  • గతంలోని రూల్స్​ను సవరించకుండా ఇస్తే పేదలు నష్టపోతరని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: రేషన్​ కార్డుల లబ్ధిదారుల ఎంపిక గ్రామాల్లోనే జరగాలని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ‘‘దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు.. జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ప్రారంభించే కార్యక్రమాల్లోనూ కాంగ్రెస్ ​సర్కారు ప్రజలను మోసం చేస్తున్నది. రేషన్​ కార్డులపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. పాపం చేసింది రేవంత్​ రెడ్డి అయితే.. శాపం మాత్రం అధికారులకు తగులుతున్నది” అని వ్యాఖ్యానించారు. శనివారం హరీశ్​రావు తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. 

కులగణన సర్వే ఆధారంగా తయారుచేసిన రేషన్​కార్డు లబ్ధిదారుల లిస్టును మాత్రమే ఊర్లకు పంపారన్నారు. కానీ,  మీ సేవలో కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు.  ప్రజాపాలనలో 11 లక్షల దరఖాస్తులు వచ్చినా ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. కులగణన సర్వే చేసేటప్పుడు ఇష్టం ఉన్నోళ్లే పాల్గొనవచ్చని ఆప్షన్​ ఇచ్చారని, ఇప్పుడేమో ఆ లిస్టు ఆధారంగానే రేషన్​కార్డులు రాకుండా కోతలు పెడుతున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలోని నంగునూరులో 110 మంది ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకుంటే.. లిస్టులో మాత్రం 40 మంది పేర్లే ఉన్నాయని, అధికారులను అడిగితే హైదరాబాద్​ నుంచి వచ్చిన లిస్ట్​ అని చెబుతున్నారని పేర్కొన్నారు. కాగా, రేషన్​ కార్డుల అంశంపై సీఎం రేవంత్​ రెడ్డికి హరీశ్​రావు బహిరంగ లేఖ రాశారు. 

సర్కారుది కోతలుపెట్టే ఆలోచన

రేషన్​ కార్డులు ఎక్కువ మందికి ఇవ్వాలన్న ఆలోచన గత బీఆర్ఎస్​ సర్కారుదైతే.. ఎక్కువ మందికి కోతలు పెట్టాలన్నది కాంగ్రెస్​ సర్కారు ఆలోచన అని హరీశ్​రావు విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో 6,47,479 కొత్త రేషన్​ కార్డులు ఇచ్చామని చెప్పారు. ఆదాయ పరిమితిని కూడా కేసీఆర్​ పెంచారని గుర్తుచేశారు. అంగన్​వాడీలు, ఆశాలు, ప్రైవేట్​, ఔట్​సోర్సింగ్​, కాంట్రాక్టు ఉద్యోగులకు లాభం జరగాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎంతో మంది జర్నలిస్టులు, ప్రైవేట్​ ఉద్యోగులు, చిరు ఉద్యోగులు తెల్ల రేషన్ కార్డులు పొందారని తెలిపారు. అభయహస్తం మేనిఫెస్టోలో రేషన్ కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా అమలు చేయలేదని పేర్కొన్నారు. 

గతంతో పోలిస్తే ఇప్పుడు ధరలు పెరిగాయని, దాని ప్రకారం ఆదాయ పరిమితిని పెంచాలని డిమాండ్​ చేశారు. పాత నిబంధనలే కొనసాగించడం వల్ల చాలా మంది రేషన్​ కార్డు అర్హతను కోల్పోతారన్నారు. 28వ తేదీ నుంచి గ్రామ సభల్లో రేషన్​ కార్డుల గురించి ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. వ్యవసాయ కూలీలకు ఇచ్చే భరోసాలోనూ సర్కారు కోతలు పెడుతున్నదని హరీశ్​ రావు విమర్శించారు.

 రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. గ్రామంలో దరఖాస్తే తీసుకోలేదన్నారు. ఉపాధి కూలీలు 1.04 కోట్ల మంది ఉంటే.. 20 రోజులు పనిచేసే వారికే అని నిబంధనలు పెట్టి.. అర్హులను 25 లక్షలకు కుదించారని ఆరోపించారు. ఆదిలాబాద్​ జిల్లా బేల మండలం సైదాపూర్​ గ్రామానికి చెందిన రైతు రుణమాఫీ కాక బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకున్నాడని, రుణమాఫీ జరిగితే ఆ రైతు ఎందుకు చనిపోయాడని ప్రశ్నించారు.