వడ్లు కొనకపోతే రోడ్ల మీదికి వస్తం: హరీశ్​

వడ్లు కొనకపోతే రోడ్ల మీదికి వస్తం: హరీశ్​
  • కోతలు మొదలై నెలరోజులైనా ఎందుకు కొంటలే
  • రైస్​ మిల్లర్లతో చర్చించిసమస్యను పరిష్కరించాలి
  • రైతులకు కేసీఆర్​ ఇచ్చినటార్పాలిన్లే తప్ప కొత్తవి ఏవీ?
  • మా హయాంలో కల్లాలకు వడ్లు రాకముందే ఏర్పాట్లు చేసెటోళ్లం
  • సీఎం, మంత్రులు కొనుగోలు సెంటర్లను పరిశీలించాలని డిమాండ్​

సిద్దిపేట వెలుగు: ఇప్పటికే చారాణా మందం వడ్లను రైతులు బయట అమ్ముకున్నారని, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కొనుగోళ్లను ప్రారంభిస్తుందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేయాల్సి వస్తదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కాల్సి వస్తదని హెచ్చరించారు. ‘‘రైసు మిల్లర్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలి. ఇప్పటికే చారాణా మందం వడ్లు వెళ్లిపోయినయ్​. ఆయింత పోయినంక కొనుగోళ్లు చేపడ్తరా? వరి కోతలు ప్రారంభమై నెలరోజులైనా ప్రభుత్వం కండ్లు తెరుస్తలేదు. జల్ది వడ్లు కొనుగోలు చేయాలి” అని డిమాండ్​ చేశారు.

ఆదివారం సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని హరీశ్​రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ వరి కోతలు ప్రారంభమై నెల రోజులైన వడ్లు కొనుగోలు చేయడం లేదు.  ఓట్లప్పుడు ఊరురా తిరిగి రైతుల మద్దతు కోరిన రేవంత్‌‌‌‌రెడ్డి.. ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్లి మద్దతు ధర వస్తుందా లేదా అని ఎందుకు అడుగుతలే?” అని ప్రశ్నించారు. ఈ సీజన్​లో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని వడ్లు కొన్నరో చెప్పాలని డిమాండ్​ చేశారు.

‘‘ఈ ప్రభుత్వానికి సంచులు పంపే తెలివి కూడా లేదు. అన్ని పాత సంచులే పంపిన్రు. వానొస్తే వడ్ల కుప్పలపై కొప్పుకోడానికి టార్పలిన్​ కవర్లు కూడా ఇస్తలేరు. కేసీఆర్​ ఉన్నప్పటి కవర్లే తప్ప ఒక్క కవరన్నా రేవంత్​ కొన్నడా? సీఎం రేవంత్​రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటున్నడు” అని అన్నారు. 15, 20 రోజులుగా రైతులు ఇంటికి వెళ్లకుండా వడ్ల కల్లాల దగ్గరే కావాలి కాస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మక్కలు కొనే దిక్కు కూడా లేదన్నారు. రూ. 7,521కు కొనుగోలు చేయాల్సిన పత్తిని, బయట వారికి కేవలం రూ.5000కు రైతులు అమ్ముకొని నష్టపోతున్నారని చెప్పారు.  

వడ్లు కల్లాలకు రాక ముందే సంచులు పంపినం

కేసీఆర్ హయాంలో వడ్లు కల్లాలకు రాకముందే సంచులు పంపించి, మిల్లులతో టైయ్యప్ చేపించి, ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేసి మరీ రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేశారని హరీశ్​రావు  అన్నారు. ‘‘కేసీఆర్ రైతుబంధు రెండు సార్లు ఇస్తే మూడుసార్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిండు. కానీ ఆయన సీఎం అయ్యాక ఒక్కసారి కూడా రైతుబంధు ఇవ్వలే. రాష్ట్రంలో ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ కాలేదు. వంద కారణాలు చూపించి చాలా మందికి రుణమాఫీ చేయలేదు” అని దుయ్యబట్టారు. సీఎం, మంత్రులు హైదరాబాద్‌‌‌‌ను వదిలి, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి పరిశీలించాలని డిమాండ్​ చేశారు. రైతులకు మద్దతు ధరతో పాటు, రూ.500 బోనస్ ఇవ్వాలని ఆయన అన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపం 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి గిరిజన గురుకులంలో 60 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలైన ఘటనపై ఆదివారం ఆయన ట్వీట్​ చేశారు. ప్రజాపాలన అని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్​ ఆందోళనకరమవుతున్నదని తెలిపారు. 60 మంది పిల్లలు అస్వస్థతకు గురైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని చెప్పారు.

స్థానిక ఆస్పత్రుల్లో విడతలవారీగా విద్యార్థులను చేర్చి చేతులు దులుపుకున్నారు తప్ప.. వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఓ విద్యార్థిని వెంటిలేటర్ పైకి చేరిందని ఆమె పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. సకాలంలో ట్రీట్ మెంట్ ఎందుకు అందించలేదన్నారు. విద్యాశాఖ కూడా సీఎం దగ్గరే ఉందని, రోజురోజుకూ దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలిపే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.