
సిద్దిపేట, వెలుగు: వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శనివారం నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంట బీమా తెస్తామని, రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని, రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు.
రూ.9 వేల కోట్ల రైతుబంధు ఇవ్వాల్సి ఉంటే, రూ.4 వేల కోట్లు ఇచ్చి మిగిలిన వాటికి కోతలు పెట్టారని విమర్శించారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే పది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. హార్టికల్చర్ యూనివర్సిటీలో ఎన్నో ఎకరాల్లో చెట్లను నరికేశారని, ఈ రోజు అధికారుల ఉద్యోగాలు పోయి జైలుకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు పనులతో అధికారులు బలయ్యే పరిస్థితి ఉందన్నారు.