
- రాష్ట్ర బడ్జెట్ లో 20వేల కోట్లు కేటాయించాలి: హరీశ్‌రావు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టుల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. బడ్జెట్లో రూ.20వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఫలితాలు అందినప్పుడు మాత్రమే బీసీ వర్గాలు సంతోషిస్తాయని హరీశ్‌రావు తెలిపారు.
అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇస్తూనే, పార్లమెంట్ లో జరిగే పోరాటానికి కూడా బీఆర్ఎస్ కలిసి వస్తోందన్నారు. బీసీ బిల్లు పాస్ కావాలంటే లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గట్టిగా పూనుకోవాలని సూచించారు. గతంలో కేసీఆర్ సర్కారు హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లో, డైరెక్టర్లులో బీసీలకు 50% రిజర్వేషన్ తెచ్చినట్టు గుర్తుచేశారు. మద్యం షాపుల్లోనూ గౌడ్స్ కు రిజర్వేషన్లు కల్పించినట్టు వివరించారు.
బీఆర్ఎస్ ఇచ్చిన మూడు అంశాలను బిల్లులో చేర్చాలని కోరారు. బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, క్యారీ ఫార్వర్డ్ విధానంలో అమలు చేయాలన్నారు. క్యారీ ఫార్వర్డ్ విధానంలో కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేశారని వివరించారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలోనూ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు.