44 డిగ్రీల ఎండలో.. సుర్రుమనే ఇసుకలో కాళేశ్వరం కోసం కష్టపడ్డాం : హరీష్ రావు

44 డిగ్రీల ఎండలో.. సుర్రుమనే ఇసుకలో కాళేశ్వరం కోసం కష్టపడ్డాం : హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తాము పడిన కష్టాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలో ప్రజలకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాల్లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా పట్టుబట్టారు కాబట్టే.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకోసం పగలు, రాత్రి కష్టపడి పనిచేశారు కాబట్టే మూడేళ్లలో ఈ అద్భుతం ఆవిష్కారం అయిందన్నారు హరీష్ రావు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.. ఇంజినీర్ల కష్టం.. భూనిర్వాసితుల త్యాగఫలమే కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు హరీష్ రావు. “44 డిగ్రీల ఎండలో.. సుర్రుమనే ఇసుకలో కార్మికులు, అధికారులు, అందరం కష్టపడ్డాం. ముట్టుకుంటే సలాకలు సుర్రుమనేవి. ఆ ఎండలో కాంక్రీటు వేయాలి. కిందనేమో గోదావరి ఇసుక. సల్లతాగుతూ.. గంట పనిచేసి.. గంట సేపు సేద తీరేవాళ్లం. ఆ కార్మికులకు. శిరసు వంచి వందనం చేస్తున్నా” అన్నారు హరీష్ రావు.

అంతర్రాష్ట్ర ఒప్పందం కోసం చేసిన ప్రయత్నాలను కూడా హరీష్ రావు వివరించారు. “సీఎస్ జోషి, ఈఎన్సీ హరేరామ్, నేను ఓసారి అంతర్రాష్ట్ర ఒప్పందం విషయంలో మహారాష్ట్రకు వెళ్లాం. పోతే పనికాలే. పొద్దున వెళ్లి సాయంత్రం వస్తామని వెళ్లాం. పనికాలే. తెల్లారి కావాలె. ఏం చెయ్యాలె బట్టలు తీసుకపోలే. సాయంత్రం 8గంటలకు ముగ్గురం పోయి బట్టల దుకాన్ల ఓ డ్రాయర్, బనీన్, అంగి, లాగు కొనుక్కచ్చుకున్నం. రాత్రి ఆడ పండుకోని పొద్దుగాల స్నానం చేసి పొద్దుగాల పనిచేస్కోని సాయంత్రం వచ్చినం. ఉన్నతాధికారి అయిన జోషి లాంటి మనిషి కూడా ఈ ప్రాజెక్టు కోసం సామాన్యుడిలాగే ఎంతో కష్టపడ్డారు. కళ్లుమూసుకున్నా కాళేశ్వరమే కనిపించేలా రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు భూసేకరణకోసం కష్టపడి 50 వేల ఎకరాల భూమిని అందించారు. వారందరికీ ధన్యవాదాలు” అన్నారు హరీష్ రావు.

కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో భాగస్వామ్యమై పనిచేయడం గొప్పగా అనిపిస్తోందనీ.. ఈ జన్మకు ఇంకా ఏదో కావాలని తనకు లేదని అన్నారు హరీష్ రావు. జీవితంలో ఓ మంచి పనిచేయగలిగాం.. అంతకంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదని .. ఇది తన పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నా అన్నారు హరీష్ రావు.